Araku Valley Attracting Tourists : పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు విశాఖ మన్యం. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే అరకులోయ మరింత సుందర మనోహరం. మన్యంలో తప్పక చూడాల్సిన ప్రాంతం మరొకటి ఉంది. అదే 'గిరి గ్రామ దర్శిని' (Giri Grama Darshini). సిటీ లైఫ్‌తో బిజీబిజీగా గడిపే నేటి తరం అక్కడకు వెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీరుతూ, గిరిపుత్రులతో మమేకమవుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న 'గిరి గ్రామ దర్శిని' చూసేద్దాం రండి.
స్వచ్ఛమైన మనసు కలిగిన గిరిజనులు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. గిరిజనుల వేష, భాష, కట్టుబాట్లు ప్రతీదీ ప్రత్యేకమే. ఎవరైనా ఒక్కరోజైనా గిరిజనుల్లా గడపాలనుకుంటే ఆ ప్రదేశానికి వెళ్తే కోరిక నెరవేరినట్లే. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు పాడేరు ఐటీడీఏ (INTEGRATED TRIBAL DEVELOPMENT AGENCY) అధికారులు. అరకులోయ సమీపంలో పెదలబుడులో ఉన్న గిరి గ్రామ దర్శినిలో అడుగుపెట్టగానే గిరిజన గ్రామాన్ని సందర్శించినంత అనుభూతి కలుగుతుంది. సహజసిద్ధమైన గడ్డితో తయారుచేసిన పూరి గుడిసెల్లో గిరిపుత్రులు ఏ విధంగా జీవిస్తారో కళ్లకు కడుతోంది.
ఇక్కడ మరో ప్రత్యేకం ఏంటంటే, పర్యాటకులు గిరిజనుల జీవన విధానాలను అనుసరించేలా ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు అచ్చం గిరిజనుల్లా వస్త్రాలు, ఆభరణాలు అలంకరణ చేస్తున్నారు. మన్యంవాసులు వాడే సామగ్రి, పనిముట్లు అందుబాటులో ఉంచారు. వాటిని పట్టుకొని గిరిజనుల మాదిరిగా ఫోటోలు దిగుతూ సందర్శకులు సందడి చేస్తున్నారు. అంతే కాదండోయ్ గిరిజన సంప్రదాయ నృత్యం థింసా మరింత ఆకర్షణగా నిలుస్తోంది. గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ ఆడిపాడుతున్నారు. గిరిజనుల వేషధారణలో తమను చూసుకుంటూ ఫొటోలు దిగుతూ మురిసిపోతున్నారు.
పర్యాటకులకు సరికొత్త అనుభూతి కల్పించేలా గిరిజన సంప్రదాయంలో వివాహం చేసుకునే వెసులుబాటును ఐటీడీఏ అధికారులు కల్పించారు. గిరిపుత్రుల ఆచారాలు ప్రతిబింబించేలా పచ్చటి పందిరి వేసి బంధుమిత్రులు సపరివారంగా పెళ్లి తంతు చేస్తారు. ఇటీవల ఓ రిటైర్డ్ టీచర్ దంపతులు ఇక్కడే షష్టి పూర్తి చేసుకుని తెగ మురిసిపోయారు. జీవితాంతం ఈ క్షణాలు గుర్తిండిపోతాయని హర్షం వ్యక్తం చేశారు. ఇంకెందుకు ఆలస్యం జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించేలా ఉన్న గిరి గ్రామ దర్శినిని మీరూ సందర్శించి మధురానుభూతిని పొందండి.