Electric Buses in Guntur District : వాతావరణంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలోకి విద్యుత్ బస్సులను ప్రవేశ పెడుతున్నాయి. ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకం కింద ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లిన ప్రతిపాదనల్లో గుంటూరు జిల్లాకు వంద బస్సులు కావాలని కోరారు. వీటి వల్ల కాలుష్యం తగ్గుతుంది. నిర్వహణ వ్యయం కూడా బాగా తక్కువే.
విద్యుత్ బస్సులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బస్సు రానుపోనూ వంద కిలోమీటర్ల దూరం ఉండేలా ఆయా మార్గాల్లో పల్లె వెలుగు కింద నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు రవాణా సంస్థలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పల్లెవెలుగు కింద మార్చి నడుపుతున్నారు. వీటి నిర్వహణ వ్యయం పెరగడంతోపాటు కాలుష్యానికి కారకాలవుతున్నాయి. వచ్చే 100 బస్సుల్లో అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా 20, మిగిలినవాటిని పల్లెవెలుగు కింద నడపనున్నట్టు ఆర్టీసీ ఆర్‌ఎం రవికాంత్ పేర్కొన్నారు. ఛార్జీల భారం పెద్దగా ఉండదని చెబుతున్నారు.
పెదకాకానిలో ఛార్జింగ్ స్టేషన్ : గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న పెదకాకాని బస్టాండు వెనుక ఏపీఎస్ఆర్టీసీకి 3.5 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండులోనూ నెలకొల్పాలన్న ప్రణాళికలున్నాయి.
ప్రత్యేకతలు :
- బస్సుల పొడవు 12 మీటర్లు
- ఒక్కో బస్సులో సీట్లు: 42
- ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
విద్యుత్ బస్సులు నడిపే మార్గాలివే :
నుంచి | వరకు | దూరం | బస్సులు |
గుంటూరు | విజయవాడ | 33 కిలోమీటర్లు | 20 |
గుంటూరు | తెనాలి (వయా నారాకోడూరు) | 26.5 కిలోమీటర్లు | 30 |
గుంటూరు | సత్తెనపల్లి | 35 కిలోమీటర్లు | 15 |
గుంటూరు | పొన్నూరు | 30 కిలోమీటర్లు | 10 |
గుంటూరు | చిలకలూరిపేట | 40 కిలోమీటర్లు | 10 |
గుంటూరు | హైకోర్టు | 40 కిలోమీటర్లు | 5 |
గుంటూరు | సచివాలయం | 42 కిలోమీటర్లు | 5 |
గుంటూరు | అమరావతి | 38 కిలోమీటర్లు | 5 |
మొత్తం | 100 |
కార్తికమాసం స్పెషల్ - శైవక్షేత్రాలకు 350 ప్రత్యేక బస్సులు
3,500 మంది డ్రైవర్లతో 2 వేల బస్సుల్లో - మహిళలకు ఉచిత ప్రయాణం! - Free Bus Scheme in AP