APPSC 2018 Group 1 Mains Exam: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ 6 నెలల్లో మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల టైమ్ ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ తీసుకున్నఅభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని, న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.
అంతమంది ఎలా అనర్హులవుతారు: 2018 గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అనర్హులుగా నిర్ణయించిందని కోర్టుకు నివేదించారు. జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు.
వ్యాజ్యాలపై హైకోర్టు పలు దశల్లో విచారణ జరిపింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు 2022 జూన్ 24న హైకోర్టు ధర్మాసనం ఏపీపీఎస్సీకి అనుమతిచ్చింది. నియామకాలు జరిపితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించింది. పోస్టింగ్ ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని పొందుపరచాలని పేర్కొంది. హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రధాన వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపి బుధవారం తీర్పు ఇచ్చారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం: హాయ్‌ల్యాండ్ ఆవాస రిసార్ట్స్‌లో 2021 డిసెంబరు 5వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 26వ తేదీ మధ్య తొలిసారి మాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు పిటిషనర్లు ఆధారాలతో రుజువు చేశారని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. మాన్యువల్ మూల్యాంకనం కోసం అవసరమైన సామగ్రి ముద్రణ, సరఫరా కోసం డేటాటెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏపీపీఎస్సీ 2021 నవంబరులో 17 వేల 936 రూపాయలు చెల్లించినట్లు పిటిషన్‌లో తెలిపారని వెల్లడించింది. మూల్యాంకనం ఏర్పాట్లకు 20.06 లక్షలు చెల్లించారని, అక్కడ ప్రక్రియ జరగకపోతే సొమ్ము చెల్లించక్కర్లేదన్నారని తెలిపింది.
ఈ చెల్లింపులపై వివరణ ఇచ్చే విషయంలో ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని పేర్కొంది. రెండోసారి మాన్యువల్ మూల్యాంకనానికి 49 వేల ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్ల ముద్రణ, సరఫరా నిమిత్తం ప్రభుత్వం డేటాటెక్ సంస్థకు 3.34 లక్షలు చెల్లించిందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. దీన్నిబట్టి రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. 2022 మార్చి 25 నుంచి 2022 మే 25 మధ్య రెండోసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు పిటిషనర్లు రుజువు చేశారని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు
పరీక్షను రద్దుచేయడమే ఉత్తమం: ప్రజల్లో విశ్వాసం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగాలు నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. మూడు మూల్యాంకనాల్లో అక్రమాలకు పాల్పడి లబ్ధి పొందినవారిని గుర్తించడం సాధ్యం కాదని, పరీక్షను రద్దుచేయడమే ఉత్తమమని ధర్మాసనం తెలిపింది. మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయని చెప్పింది. నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయడంలో ఏపీపీఎస్సీ, ప్రభుత్వం విఫలమయ్యాయని తేల్చిచెప్పింది. జవాబుపత్రాలను చేత్తో దిద్దాలని హైకోర్టు ఆదేశించాక ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం మరిన్ని అవకతవకలకు పాల్పడ్డాయని పేర్కొంది.
న్యాయబద్ధంగా జరగలేదు: ఈ అవకతవకలే ఎంపిక ప్రక్రియ చట్టబద్ధతను వేలెత్తి చూపడానికి కారణం అయ్యాయని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ, జగన్ సర్కార్ తీరుతో జవాబుపత్రాల మూల్యాంకనం నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరగలేదని కోర్టు భావించినట్లు వెల్లడించింది. రెండు, మూడుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొని నచ్చినవారిని ఎంపిక చేసే అవకాశం ఉందంది. ఈ నేపథ్యంలో మాన్యువల్ విధానంలో మూల్యాంకనాన్ని రద్దు చేస్తున్నామని హైకోర్టు తీర్పులో పేర్కొంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, ఎం.విజయ్‌కుమార్, జె.సుధీర్, తాండవ యోగేశ్, ఫణికుమార్ తదితరులు వాదనలు వినిపించారు.
నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత