AP Congress Candidates List: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్థానాలను పార్టీ ఖరారు దాదాపు చేసినట్లు తెలుస్తోంది. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ నిర్వహించారు. అభ్యర్దులు ఎంపికపై చర్చ జరిగింది. ఈ భేటీకి ఎపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీనియర్ నేత కొప్పుల రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మణికం ఠాగూర్ హాజరయ్యారు.
ఈ మేరకు ఏపీకి సంబంధించిన 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలను దాదాపు ఖరారు చేసింది. 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై పెండింగ్ పెట్టినట్లు సమాచారం. కడప ఎంపీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనుంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, కాకినాడ ఎంపీ అభ్యర్థి పళ్లంరాజు, బాపట్ల లోక్‌సభ అభ్యర్థిగా జె.డి.శీలం పోటీకి దిగుతున్నారు.
నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఎంపీ స్థానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉండనున్నారు. ఈనెల 9న మరోసారి సీఈసీ భేటీ అయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలి : షర్మిల - AP Congress Nine Guarantees
తెలంగాణలో ఖమ్మం మినహా మిగిలిన వాటిపై స్పష్టత: తొలుత తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చ ముగిసిన అనంతరం ఎపీ అభ్యర్థులపై భేటీ జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో కసరత్తు జరిగింది.
4 పెండింగ్ స్థానాల్లో 3 లోకసభ స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణలో 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఖమ్మం లోకసభ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఖరారు కాలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీంతో ఏపీలో మిగిలిన స్థానాలతో పాటు తెలంగాణలో ఖమ్మం స్థానంపై ఈనెల 9న జరిగే సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: వైఎస్ షర్మిల - YS SHARMILA COMMENTS ON CONTEST