Heavy Rain Alert To Andhra Pradesh : ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల అవర్తన ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా (ఆంధ్రప్రదేశ్) వైపు పయనిస్తుందన్నారు. ఇది తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలు ఉండటంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, స్తంభాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.
నైరుతి రుతుపవనాల తిరోగమణం : గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనమయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి నిష్క్రమించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షాలు పడే అవకాశముంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవిధంగా : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిత ఆదేశించారు. వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్‌న్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురువనున్న నేపథ్యంలో గండ్లు పడే అవకాశమున్న కాలువలు, గట్లను గుర్తించాలని తెలిపారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్యయంతో పని చేసి, ఎలాంటి నష్టాలు సంభవించకుండా చూడాలన్నారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముంది.
- మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- బుధవారం బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
- గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వివరించింది.
ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను-అప్రమత్తమైన ప్రభుత్వం