AP People Saddened By Ramoji Rao Passed Away: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అస్తమించడం పట్ల ఏపీ వ్యాప్తంగా సాధారణ ప్రజలు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీ గ్రూపు సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివంటూ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ కృష్ణా జిల్లా నాగాయలంకలో వివిధ పార్టీల నేతలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అద్దంకిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు. రామోజీ మరణం కలచివేసిందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విచారణ వ్యక్తం చేశారు. దూరదృష్టితో ప్రతి రంగంలో చెరగని ముద్రవేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని సామాన్య ప్రజల గొంతుకగా నిలిచారని నరసరావుపేట టీడీపీ శ్రేణులు కొనియాడారు.
రామోజీరావు తన సంస్థల ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు కొనియాడారు. నంద్యాల తెలుగుదేశం కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎండీ ఫరూక్ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల ఎన్జీవో హోంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సాహితీవేత్తలు నివాళులర్పించారు.
ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాళి - Politicians Tribute to Ramoji Rao Demise
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, బెలుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో టీడీపీ నేతలు, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు రామోజీరావుకు నివాళులర్పించారు. కుందుర్పి మండలం విలువల బడిలో చిన్నారులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వర్కింగ్ జర్నలిస్టులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామోజీకి ఘనంగా నివాళులర్పించారు. విపత్తుల వేళ బాధితులను ఆయన ఆదుకున్న తీరును కొనియాడారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన, ఇతర పార్టీ నేతలు రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు రామోజీ పేరు వినపడుతూనే ఉంటుందన్నారు. శ్రీకాకుళంలో ఈటీవీ, ఈనాడు ఉద్యోగులు, టీడీపీ నేతలు రామోజీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకుని నివాళులర్పించారు. ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించిన రామోజీ ఆకస్మిక మృతి పట్ల విశాఖ జనసేన అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్, గండి బాబ్జీ విచారం వ్యక్తం చేశారు.
రామోజీరావు మరణం తీరని లోటని పి.గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరయోధుడి మృతి పట్ల తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ నేతలు అంజలి ఘటించారు. రామోజీరావు దార్శనికుడని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కొనియాడారు. అంతటి మహోన్నత వ్యక్తి మరణం తీరని లోటన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు, రాజకీయ నేతలు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచే ఉంటారని అన్నారు. రామోజీరావు సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి అక్షర యోధుడుగా, ఒక మార్గదర్శిగా, విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కొనియాడారు.
రామోజీరావు ఒక పోరాట యోధుడు- ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు: వెంకయ్యనాయుడు