AP CS NOT FOLLOWING EC ORDERS: ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పని చేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. సీఎస్ జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదేశం, అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
వాలంటీర్ల ద్వారా పించన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే, సీఎస్ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన ఈసీ చోద్యం చూస్తూ కూర్చుంది. ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. అయినా ఈసీ ఏ ఒక్కరి పైనా చర్యలు తీసుకోలేదు.
మే నెల దగ్గర పడుతున్నా పింఛన్ల పంపిణీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు లేవు. మే నెలలోనైనా ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఈసీ ఇప్పటికి ఎందుకు స్పష్టమైన ఆదేశాలివ్వట్లేదు? అంతకుముందు నెల వరకూ కొనసాగిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగించాలని ఎందుకు సీఎస్‌కు చెప్పట్లేదు? ఇలాగే ఉంటే ఈసారి కూడా ఏప్రిల్ పరిస్థితులే పునరావృతం కావా అన్న ప్రశ్నలు అనేక మంది నుంచి వినిపిస్తున్నాయి.
"ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన లబ్ధిని వాలంటీర్ల ద్వారా కాకుండా, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేదా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని మార్చి 30న ఆదేశాలిచ్చాం. అయితే వివిధ పథకాల పంపిణీ సక్రమంగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, పంపిణీ ప్రక్రియ మారడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టండి" అని ఎన్నికల సంఘం ఈ నెల 26న సీఎస్‌కు లేఖ రాసింది.
ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం ఈసీ దృష్టిలో ఉంది. అలాంటప్పుడు కచ్చితంగా లబ్ధిదారుల ఇంటివద్దకే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ నిర్దిష్టంగా ఎందుకు సీఎస్‌కు ఆదేశాలివ్వట్లేదు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ ఆదేశాలను యథాతథంగా అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరించట్లేదు? అని కొంత మంది అనుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతిని ఖరారు చేసి తదనుగుణంగా పంపిణీ చేయాలని, కచ్చితమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఏదో సీఎస్‌కు సలహా ఇచ్చినట్లు, సూచించినట్లు చెప్పడమేంటి? అంటే సీఎస్ ఆధీనంలో ఈసీ పనిచేయాలా అని మేధావులు చర్చించుకుంటున్నారు.