AP ICET Results 2024: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో జూలై 22 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి చెప్పారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో వీసీ హుసేన్ రెడ్డితో కలిసి హేమచంద్రారెడ్డి ఏపీఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. మే 6వ తేదీన ఐసెట్ పరీక్ష నిర్వహించగా, 44 వేల 447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎస్కేయూ రెండో సారి ఏపీఐసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన వారిలో 96.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎడు-ఎక్స్ ద్వారా విదేశీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా ఆన్ లైన్ కోర్సుల్లో శిక్షణ పొందే ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఐసెట్ లో విజయవాడకు చెందిన ఆర్ల క్రాంతి కుమార్ తొలి ర్యాంకు, రాజమండ్రి కి చెందిన గుణ్ణం సాయి కార్తీక్ రెండో ర్యాంకు, గాజువాక కు చెందిన సూరిశెట్టి వసంతలక్ష్మి మూడో ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు.
I CET RESULTS: నేడు ఐసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎనిమిదో సారి ఏపీఈసెట్-2024 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి చెప్పారు. అనంతపురం జేఎన్టీయూ వీసీ, ఏపీఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 14 విభాగాల్లో చదివిన వారు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం కొరకు ఏపీఈసెట్-2024 పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష కోసం 37,767 మంది దరఖాస్తు చేయగా, 36 వేల 369 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఏపీఈసెట్ పరీక్షకు హాజరైన వారిలో 90.41 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన చెప్పారు.
ఈసారి పరీక్ష రాసిన వారిలో హైదరాబాద్ కు చెందిన వారు అత్యధికంగా 95.75 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీఈసెట్ కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. ఈసారి కనిష్టంగా విజయనగరం విద్యార్థులు 84.59 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లా విద్యార్థులు 93.56 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచారన్నారు. ఏపీఈసెట్-2024లో బాలుర కంటే బాలికలే అధికంగా 93.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.