AP High Court Stay on BEd Students for SGT Posts: ఎస్జీటీ (SGT) పోస్టులకు బీఈడీ (B.Ed) అభ్యర్థులను అనుమతించే నిబంధనపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశాల మేరకు బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ (Secondary Grade Teachers) పోస్టులకు అనుమతించబోమని అడ్వకేట్ జనరల్ (Advocate General) నివేదించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ బొల్లా సురేష్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై తొలుత మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను జగన్ సర్కార్ అనుమతించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్లొద్దన్న హైకోర్టు అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయవద్దని ఆదేశించింది.
డీఎస్సీకి అభ్యర్థులకు జగన్ సర్కార్ షాక్ - మరోసారి రుసుము కట్టాలని సూచన
అయితే అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ (Advocate General Sriram) స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. హాల్ టికెట్లను ఈనెల 22 నుంచి జారీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. పూర్తి వివరాల సమర్పణకు ఏజీ(AG) సమయం కోరడంతో విచారణను హైకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ మేరకు ఈరోజు విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మరో 8 వారాలకు వాయిదా వేసింది.
DSC Notification in AP 2024: కాగా 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత ఉందంటూ ప్రకటించింది. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీం కోర్టు(Supreme Court) తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడీ వారికి అర్హత ఉండదని భావించిన అభ్యర్థులకు ప్రభుత్వ తాజా ప్రకటనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వనందున డీఎస్సీ-2018లో నిబంధనలనే ఈసారీ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ(School Education Department) నిర్ణయిస్తూ డీఎస్సీకి నోటిఫికేషన్(DSC Notification) ఇచ్చింది.
హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన