AP High Court On Ramana Deekshitulu Petition: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని రమణ దీక్షితులను ఆదేశిస్తూ తిరుపతి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఐటీ శాఖకు చెందిన మురళీ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణ దీక్షితులపై కేసు నమోదు చేశారు.
టీటీడీ గౌరవ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు నోటీసులు - వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్
సోషల్ మీడియాలో గొంతును గుర్తించేందుకు వీలుగా రమణ దీక్షితుల వాయిస్ శాంపిల్‌ను పరీక్షకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పోలీసులు తిరుపతి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన న్యాయస్థానం, మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని రమణ దీక్షితులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శీతిరాజు శ్యాంసుందర్‌రావు వాదనలు వినిపించారు.
సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం వాయిస్ శాంపిల్‌కు పంపే అధికారం తిరుపతి కోర్టు మెజిస్ట్రేట్‌కు లేదన్నారు. పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించేవిగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇవ్వాలన్నట్లు తిరుపతి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. వాటి అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, దిగువ కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చారు.
కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు
కాగా కొద్ది నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో రమణ దీక్షితులు వీడియో వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. టీటీడీతో పాటుగా, మాజీ ఈవో ధర్మారెడ్డి, తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ధర్మారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో తన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో రమణ దీక్షితులు దీనిపై మీడియాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. తనకు ఆ వీడియోలతో ఎలాంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. తాను అలా మాట్లాడడం నా స్వభావం కాదని, తమ కల్చర్ కూడా కాదని చెప్పుకొచ్చారు. తాను చేయని దానికి బాధితుడ్ని చేస్తే తానేం చేయలేనని అన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో మణ దీక్షితులకు హైకోర్టులో ఉపశమనం లభించినట్లైంది.
తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు... ట్విటర్‌లో రమణ దీక్షితులు