AP HC on Kukkala Vidyasagar Petition : ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరచాలని కుక్కల విద్యాసాగర్ వేసిన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. కేసును దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ ధర్మసనాన్ని కోరారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
మరోవైపు అరెస్ట్‌తో పాటు విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్ తేలేవరకు బెయిల్ పిటిషన్ విచారణకు ట్రయల్ కోర్టును ఒత్తిడి చేయబోమని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. కింది కోర్టులో జరగనున్న విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌పై విచారణకు ఒత్తిడి చేయబోమని పోలీసులు హైకోర్టుకి హామీ ఇచ్చారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
మరోవైపు ముంబయి నటి కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నాలుగో ఏసీఎంఎం కోర్టు ఈ నెల 29 వరకు పొడిగించింది. నేటితో రిమాండ్ గడువు ముగుస్తుండటంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. సినీ నటిపై అక్రమంగా కేసు నమోదు చేసిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ను ఏ1గా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టైన విద్యాసాగర్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు
"ముంబయి సినీ నటి కేసు" - ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా