HC on Janasena Party Symbol: కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.కృష్ణమోహన్ ప్రకటించారు. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం, అందుకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ECI) ఆదేశించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యూలర్)పార్టీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంవీ రాజారామ్ వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో రికార్డులను పరిశీలించాలని కోరారు. జనసేన పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. గతేడాది డిసెంబర్ 12న చేసిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని ఈసీ తమకు గాజుగ్లాసు గుర్తును కేటాయించిందన్నారు.
ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్, న్యాయవాది శివదర్శిన్ వాదనలు వినిపిస్తూ పార్టీ గుర్తు కేటాయింపు కోసం 'జనసేన' ముందుగా దరఖాస్తు చేసుకుందని, చట్ట నిబంధనలకు అనుగుణంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట విధానంలో పార్టీ గుర్తు కేటాయించినట్లు తెలిపారు. పైన పేర్కొన రెండు పార్టీలు అన్ రికగ్నైజ్డ్ రిజిస్ట్రర్ పార్టీలన్నారు.
ఇలాంటి పార్టీలు అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి 6 నెలల ముందు ఫ్రీ సింబల్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత డిసెంబర్ 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదే రోజు జనసేన పార్టీ దరఖాస్తు చేసిందన్నారు. పిటిషనర్ పార్టీ(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్) డిసెంబర్ 20న దరఖాస్తు చేయగా అది 26న అందిందన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.