AP High Court Canceled Appointment of DOP: వైసీపీకు చెందిన జల్లా సుదర్శన్‌రెడ్డిని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(డీవోపీ)గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. నియామక జీవో 552ని రద్దు చేసింది. ప్రాసిక్యూషన్స్ నుంచి వచ్చే వ్యక్తినే డైరెక్టర్‌గా నియమించాలంది. కొత్తగా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఎంపికకు ప్రక్రియను సిద్ధం చేయాలని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో కొత్త డైరెక్టర్‌ను నియమించాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. చట్ట నిబంధనలను అనుసరించి, ప్రతిభ అధారంగా పోస్టును భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
ప్రాసిక్యూషన్ డైరెక్టర్ నియామక విధివిధానాలు, పదవీకాలం, క్రమశిక్షణ అథారిటీ, తొలగింపు, సస్పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను ఖరారు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. ప్రాసిక్యూషన్ డైరెక్టర్ నియామకానికి రాష్ట్రప్రభుత్వం పారదర్శక, న్యాయబద్ధ విధానాన్ని అనుసరించాలని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో నియామకం జరుగుతుందన్న కారణంగా సాధారణ పద్ధతులలో నిర్వహించే రాత, మౌఖిక పరీక్షల విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని భావించడం సరికాదంది. 4 నెలల్లో కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది.
కొత్త డైరెక్టర్‌ను నియమించేంత వరకు సుదర్శన్‌రెడ్డిని తాత్కాలికంగా అదే పోస్టులో కొనసాగించుకోవచ్చని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి తెలిపింది. నాలుగు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే ఆ తర్వాత సుదర్శన్‌రెడ్డి కొనసాగడానికి వీల్లేదని షరతు విధించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తనను డైరెక్టర్‌గా నియమించేలా ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థన తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు కీలక తీర్పు ఇచ్చింది.
ఆర్అండ్బీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
డీవోపీగా (Director of Prosecution) జల్లా సుదర్శన్‌రెడ్డి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2023 మే 22న ఇచ్చిన జీవో 552ను సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్ బి.రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సుదర్శన్‌రెడ్డి అన్నమయ్య జిల్లా గాలివీడు వైసీపీ మండల పరిషత్ అధ్యక్షుడి(ఎంపీపీ)గా పనిచేస్తున్నారన్నారు. ఆ పదవికి రాజీనామా చేసి ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. అధికార పార్టీకి చెందినవారన్నారు. డీవోపీ నియామకానికి ముందు తాను ఏ పోస్టు నిర్వహిస్తున్నారో చెప్పకుండా గోప్యంగా ఉంచారన్నారు.
సుదర్శన్‌రెడ్డి నియామకానికి హైకోర్టు పరిపాలనపరమైన సమ్మతి తెలియజేయడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. నిబంధనల ప్రకారం ఆ పోస్టుకు తాను అర్హుడని తెలిపారు. పదోన్నతి కల్పించడం ద్వారా ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపీ ప్రాసిక్యూషన్ సర్వీసు నిబంధనలు, సీఆర్‌పీసీ, ఏపీ విభజన చట్టలోని సెక్షన్ 78కి విరుద్ధంగా సుదర్శన్‌రెడ్డిని నియమించారన్నారు.
సుదర్శన్‌రెడ్డి పేరును పరిశీలించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను హైకోర్టు గతంలో 2 సార్లు తిరస్కరించిందన్నారు. అనూహ్యంగా 2023 మేలో సుదర్శన్‌రెడ్డి పేరుకు హైకోర్టు సమ్మతి తెలిపిందన్నారు. సమ్మతి ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. నిబంధనలకు అనుగుణంగానే నియామకం చేశామన్నారు. ఏజీ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
వెంకటరెడ్డి నియామకంపై హైకోర్టులో పిటిషన్- విచారణ మార్చి 27కు వాయిదా
ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా? - ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం