AP Govt Increased Dupa Deepa Naivedyam Scheme Charges : మరో ఎన్నికల హమీ అమలుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆదాయం లేని చిన్న గుళ్లల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10వేల చొప్పున అందనుంది.
ఆదాయం లేని చిన్న గుళ్లల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో నెలకు రూ.2,500 అందిస్తుండగా 2015లో టీడీపీ ప్రభుత్వం దీనిని రూ.5 వేలకు పెంచింది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని కూటమి నేతలు ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వు జారీ చేశారు.
ఆన్లైనలో జమ : ఇందులో రూ.7 వేలు అర్చకుడికి భృతిగా, రూ.3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. దీన్ని ప్రతినెలా అర్చకుడి ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా జమచేయనున్నారు. డీడీఎన్‌ఎస్ సాయం పెంచడంతో ఏడాదికి ప్రభుత్వంపై అదనంగా రూ.32.40 కోట్ల భారం పడనుంది. దీనిని దేవాదాయశాఖకు చెందిన సర్వ శ్రేయో నిధి (సీజీఎఫ్) నుంచి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.