Employment for Youth in Amaravati : రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీలోని నిరుద్యోగ యువతను భాగస్వాముల్ని చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వివిధ రంగాల్లోని వారికి మెరుగైన శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంచి రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేయనున్నారు. దీని కోసం సీఆర్డీఏ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ట్రక్షన్ (న్యాక్) సంయుక్తంగా పనిచేస్తున్నాయి.
వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులను రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యుల్ని చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, జేసీబీ సంస్థ సహకారంతో భవన నిర్మాణం రంగంలో ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు. ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంతో పాటు ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వసతితో శిక్షణ ఇవ్వనున్నారు. రాజధాని పనులు ప్రారంభమయ్యే నాటికి ఏపీలోని సుమారు 10,000ల మంది కార్మికుల్ని రాజధాని పరిధిలోని భవన నిర్మాణం రంగంలో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
Amaravati Construction Works Updates : భవిష్యత్లో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమల కోసం బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్ సైన్స్ చదివిన నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎంపవర్‌మెంట్ సెంటర్‌లో కోర్సును బట్టి 60 నుంచి 90 రోజుల పాటు 18 నుంచి 30 ఏళ్లలోపు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు.
మంగళగిరితో పాటు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇప్పటికే నైపుణ్యగణన పూర్తయ్యింది. దాదాపు 43,000ల మంది వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా రంగాల్లో ప్రవేశం ఉన్న వారిని ఇప్పటికే గుర్తించారు. వీరికి అవగాహన కల్పించడానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాల్ని వివరిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న నైపుణ్యగణన తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న న్యాక్ సెంటర్ల ద్వారా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలు విడుదల
ఇక జెట్ స్పీడ్లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం