Renewable Economic Zones : సౌర, పవన విద్యుత్‌తో పాటు ఇతర పునరుత్పాదక విద్యుత్ యూనిట్‌ల ఏర్పాటు కోసం రెన్యువబుల్ ఎకనమిక్ జోన్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు తయారీ రంగ జోన్‌లను కూడా ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఇంధన శాఖ గ్రీన్ హైడ్రోజన్ సహా వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల కోసం రాష్ట్రంలో రెన్యువబుల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించంది. సౌర, పవన విద్యుత్‌తో సహా హైబ్రీడ్, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం రెన్యూవబుల్ ఎకనమిక్ జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఆర్ఈజెడ్‌లు (REZ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు రెన్యువబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లనూ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్లకు వయబులిటి గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తామని పేర్కొంది.
తక్కువ ధరకే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా: జియో థర్మల్, టైడల్ విద్యుత్, సముద్ర ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సాంకేతికత, స్టోరేజీ తదితర అంశాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నట్టు వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరుల కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఆర్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని నూతన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌తో కలిసి ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తోంది. ఎలక్ట్రోలైజర్ యూనిట్ల ఏర్పాటు, వాటి సామర్ధ్యం పెంపు ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తక్కువ ధరకే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లకు రూ.లక్షకే ఎకరా: గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటులో కీలకమైన ఎలక్ట్రోలైజర్ల ఏర్పాటుకు 25 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసిన డెవలపర్‌కు మెగావాట్‌కు కోటి చొప్పున ఐదేళ్లలో ప్రోత్సాహకం చెల్లిస్తామని స్పష్టం చేసింది. 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ముందుగా ఏర్పాటు చేసే 10 గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించింది. పోర్టుల వద్ద ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లకు ఎకరా లక్ష చొప్పున లీజుకు ఇవ్వనున్నట్టు పాలసీలో పేర్కొంది.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లకు కేంద్రం అందించే ఆర్ధిక సహకారంలో 25 శాతం రాష్ట్రం కూడా భరిస్తుందని వెల్లడించింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాల ద్వారా విద్యుత్ ప్లాంట్లకూ సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. బయో ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించింది. వీటన్నిటి నుంచి ఏపీ డిస్కమ్‌లు విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నట్టు నూతన విధానంలో ప్రభుత్వం పేర్కొంది.