AP Govt Focus on Cyber Crimes : ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నేరాల సంఖ్య, విస్తృతి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులోభాగంగా సైబర్ పోలీస్ స్టేషన్‌లను నెలకొల్పేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం, విజయవాడ నగర కమిషనరేట్లతో పాటు అమరావతిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలోనే సైబర్ ఠాణాలు ఉన్నాయి.
AP to Establish Cyber Crime Stations : ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవట్లేదు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్ని మినహాయించి మిగతా 24 జిల్లాల కేంద్రాల్లో సైబర్ పోలీస్ స్టేషన్‌లను తేవాలని సర్కార్ సంకల్పించింది. సాంకేతికంగా అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న ఇన్‌స్పెక్టర్లను ఈ స్టేషన్లకు ఎస్‌హెచ్‌వోలుగా నియమించనుంది. దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక పరికరాల్ని సమకూర్చనుంది. సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఫిర్యాదులు చేస్తున్న వారు తక్కువ. ప్రతి సైబర్ నేరానికీ సంబంధించి ఫిర్యాదు ఇచ్చేలా బాధితుల్ని ప్రోత్సహించడం, కేసు దర్యాప్తు చేయటం ఈ పోలీస్ స్టేషన్ల బాధ్యత.
అత్యధిక శాతం ఆర్థిక మోసాలే : ఆంధ్రప్రదేశ్‌లో జరిగే దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఏటా దాదాపు రూ.150 కోట్లను నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. అదే సైబర్ నేరాల్లో రూ.313 కోట్ల మేర దోచేస్తున్నారు. సైబర్ నేరాల్లో ఎక్కువ శాతం ఆర్థిక మోసాలే ఉంటున్నాయి. ‘మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్‌లో మత్తుపదార్థాలు చిక్కాయి కస్టమ్స్ విభాగం అరెస్ట్ వారెంట్‌తో వస్తోంది’ అంటూ ఫోన్లలో భయపెట్టి సొత్తు కాజేయటం, ‘మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్‌గ్రేడ్ చేయకపోతే బ్లాక్ అయిపోతాయి’ అంటూ సీవీవీ నంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతాల్ని ఖాళీ చేసేయటం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఈ-కేవైసీలు, నకిలీ యాప్‌ల పేరిట దోచుకోవడాలు, నకిలీ వెబ్‌సైట్‌లతో దోచుకోవటం, మేట్రిమోని మోసాలు, ఉపాధి, ఉద్యోగాల పేరిట సొమ్ము కాజేయటం ఎక్కువయ్యాయి. వీటితో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేరాలు, మహిళలపై వేధింపులూ ఎక్కువే.
ఛేదించిన కేసులు రెండు శాతం లోపే : ఏపీలో సైబర్ నేరాలు 2019తో పోలిస్తే 2023 నాటికి 14.89 శాతం పెరిగాయి. గత ఐదేళ్లలో 10,125 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఛేదించిన కేసులు రెండు శాతం లోపే. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో ఉంటూ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవటం, సొమ్ము రికవరీ చేయటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుతో నేరాల్ని కట్టడి చేయొచ్చని సర్కార్ భావిస్తోంది.
పెరుగుతున్న సైబర్ మోసాలు - మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - Cyber Frauds in AP
రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్‌పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud