AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 6100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించారు. దరఖాస్తులు, టెట్ నిర్వహణ, ఫలితాలు తదితర వివరాలను మంత్రి బొత్స వెల్లడించారు.
ఫిబ్రవరి 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అదే విధంగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి టెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలలోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇందులో ఎస్‌జీటీ పోస్టులు 2280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299, టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215, 242 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఉన్న నియామక నోటిఫికేషన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
డీఎస్సీ వివరాలు ఇలా ఉన్నాయి: ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించి, అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 21గా ఉంది. అదే విధంగా దరఖాస్తుకు చివరి తేదీ 22గా నిర్ణయించారు. అనంతరం 24న ఆన్లైన్ మాక్ టెస్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 185 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. 2018లో నిర్వహించిన డీఎస్సీ తరహాలోనే ప్రస్తుత పరీక్ష ఉండనున్నట్లు తెలిపారు.
AP DSC Exam Dates: మార్చి 15వ తేదీ నుంచి 30 వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకూ, అదే విధంగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకూ పరీక్ష ఉండనుంది. వీటికి సంబంధించిన కీ మార్చి 31న విడుదల చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా ఫైనల్ కీ ఏప్రిల్ 2న, రిజల్ట్స్ ఏప్రిల్ 7న విడుదల చేస్తారు.
ఏపీ టెట్ వివరాలు: ఇక టెట్ వివరాలకు వస్తే, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ 17కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 18గా నిర్ణయించారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP TET Exam Dates: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. ఆన్సర్ కీని మార్చి 10వ తేదీన విడుదల చేస్తారు. ఫైనల్ ఆన్స్‌ర్ కీని మార్చి 13న, రిజల్ట్స్‌ని 14న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.