YS Sharmila Nomination: కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. కడప కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వాలని షర్మిల కోరారు.
కడప జిల్లా ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారని ఈ లోకసభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం ఉందని షర్మిల ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, వివేకానంద రెడ్డిని ఆదరించినట్లే తనను కూడా జిల్లా ప్రజలు ఆదరిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వైసీపీకి, జగన్‌కి బుద్ధి చెప్పాలని షర్మిల తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో షర్మిల కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ఛార్జిషీట్లో చెప్పిన విషయాలను తాము మాట్లాడుతుంటే భావప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు చిన్నరాయి తగిలితేనే హత్యాయత్నం అని అన్నారని, వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే ఎందుకు గుండెపోటని ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
వివేకాను గొడ్డలితో నరికి చంపడం చాలదన్నట్లు, గత అయిదేళ్లుగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వార్తలు రాస్తున్నారని షర్మిల మండిపడ్డారు. సీబీఐ చెప్పిన విషయాలను తాము మాట్లాడుతుంటే అవినాష్ రెడ్డికి, జగన్‌కి ఉలుకెందుకుని అన్నారు. గూగుల్ మ్యాప్స్ వెయ్యి మీటర్ల వరకు చూపుతుందని అవినాష్ రెడ్డి మాట్లాడటాన్ని షర్మిల తప్పుబట్టారు. అన్ని గూగుల్ మ్యాప్స్ ఆధారాలు, సెల్ టవర్ లొకేషన్లు అవినాష్ రెడ్డి ఇంటివైపే ఎందుకు చూపిస్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్ల కిందట వివేకానందరెడ్డిని ఎంత దారుణంగా హత్య చేశారో కడప జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. న్యాయం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తోందని, ఎవరిని గెలిపిస్తారో ఆలోచించు కోవాలన్నారు. అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడంటే అది వివేకానందరెడ్డి పెట్టిన భిక్షేనని వివేకా కుమార్తె సునీత అన్నారు. హత్యారాజకీయాలు అంతం కావాలంటే షర్మిలను గెలిపించు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వైఎస్ షర్మిల సభలో వైసీపీ మూకల అలజడి - మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమంటూ సవాల్ - YS Sharmila Sabha