CM CHANDRABABU NAIDU VISIT TIRUMALA : ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ తో కలిసి సాధారణ క్యూలైన్లో ఆలయానికి వచ్చిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్‌ఛార్జి ఈవో
శ్రీవారి ఆలయం నుంచి బైటకు వచ్చిన చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ చంద్రబాబును చూసేందుకు భక్తులు, తెలుగుదేశం అభిమానులు ఎగబడ్డారు. తిరుమల పెద్దజీయర్ మఠానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఆశీర్వచనం తీసుకున్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.