AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims : అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన బాధితుల వద్దకు వెళ్లి వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తూ, తానుండగా వారికేం కాదనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎంత ఖర్చయినా వాళ్లను తాను రక్షించుకుంటానని బాధితులకు భరోసా కల్పించారు. మరోవైపు వారి ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బాధితులకు పరిహారం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చాను. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘోర దుర్ఘటనలో… pic.twitter.com/JfqKJJ2u45
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2024
"ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం. ధైర్యంగా ఉండాలి. మేము అన్నీ చూసుకుంటాం. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది. 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించాం. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం, స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందిస్తాం." - చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం