Karnataka Kumki Elephants for AP : రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టేందుకు కర్నాటక నుంచి 8 కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని మన్యం పార్వతీపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాల్లో ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తున్నాయి. తద్వారా జరుగుతున్న నష్టం, వాటి దాడులతో ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో పవన్ కల్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీలో గజరాజుల దాడులు అరికట్టేందుకు కుంకీ ఏనుగుల ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రానికి 8 కుంకీ ఏనుగులు కావాలని కోరారు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection