Vote on Account Budget in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం రూ. 1,29,972 కోట్లతో ప్రతిపాదించిన ఈ పద్దును ఆమోదిస్తూ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్‌లో జలవనరుల శాఖకు కూటమి సర్కార్ పెద్ద పీట వేసింది. భారీ, మధ్య తరహా, చిన్ననీటి పారుదలకు రూ. 13,308.50 కోట్లు పెట్టుబడి వ్యయంగా కేటాయించింది. గత ఐదు సంవత్సరాల్లో నీరసించిన పలు ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించేందుకు నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది. వివిధ సంక్షేమ శాఖలకు కలిపి రూ.15,140 కోట్లను కేటాయించారు.
AP Budget 2024 : గత వైఎస్సార్సీపీ సర్కార్ జులై నెలాఖరు వరకు ఓటాన్ అకౌంట్ సమర్పించి పద్దులకు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆ గడువు బుధవారంతో తీరిపోయింది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి ఖర్చులకు అనుమతి అవసరం. ఏపీ ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు, అప్పులు, పెండింగు బిల్లుల వంటి సమాచారాన్ని ఆర్థిక శాఖ ఇంకా క్రోడీకరిస్తుండడం, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నట్లు ఈ ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్స్ జారీచేశారు. మొత్తం 40 ప్రభుత్వశాఖలకు రాబోయే నాలుగు నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతి పొందారు.
జలవనరుల శాఖలో గుత్తేదారులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో ఉన్నాయి. ప్రాజెక్టు పనుల బిల్లులు ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాజెక్టుల పనులూ నిలిచిపోయాయి. తాజా కేటాయింపుల్లో పోలవరం నిధులూ కలిపి ఉంటాయి. ఆయా బిల్లులను ఈ పద్దులోకి బదిలీ చేసి, వాటికి బడ్జెట్ విడుదల చేస్తే నిధుల లభ్యత ఆధారం ఆ మొత్తాలను విడుదల చేసేందుకు, గుత్తేదారులు పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
ఒక్కొక్కటిగా ప్రాధాన్య ప్రకారం : ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యం ప్రకారం అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తిపోతల నీటిని మళ్లించేందుకు ఆ కాలువ పనులు ఏడాదిలోగా పూర్తిచేయాలనే సంకల్పంతో ఉంది. ఇందుకు రూ.1,000 కోట్లకు పైగా అవసరం. ఇతర ప్రాజెక్టుల పూర్తికి అడుగులు వేయాలి. డెల్టా వ్యవస్థలో అవసరమైన పనులు చేపట్టడం, కాలువలు, పూడికతీత పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ నాలుగు నెలలకు కొన్ని ప్రభుత్వశాఖల్లో ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ వివరాలు ఇలా :
ప్రభుత్వ విభాగం | రెవెన్యూ | పెట్టుబడి |
రహదారులు, భవనాలు | రూ.2015.22 కోట్లు | రూ.2017.66 కోట్లు |
పాఠశాల విద్య | రూ.9875.25 కోట్లు | రూ.1458.37 కోట్లు |
ఉన్నత విద్య | రూ.736.05 కోట్లు | రూ.141.02 కోట్లు |
నైపుణ్య శిక్షణ | రూ.606.64 కోట్లు | రూ.81.83 కోట్లు |
వైద్య, ఆరోగ్యం | రూ.6782.02 కోట్లు | రూ.1198.12 కోట్లు |
పట్టణాభివృద్ధి | రూ.3550.55 కోట్లు | రూ.4424.90 కోట్లు |
గృహనిర్మాణం | రూ.2014.59 కోట్లు | - |
సాంఘిక సంక్షేమం | రూ.2732.49 కోట్లు | రూ.61.73 కోట్లు |
గిరిజన సంక్షేమం | రూ.1473.98 కోట్లు | రూ.30.27 కోట్లు |
బీసీ సంక్షేమం | రూ.8879.16 కోట్లు | రూ.27.03 కోట్లు |
మైనారిటీ సంక్షేమం | రూ.798.77 కోట్లు | రూ.7.66 కోట్లు |
మహిళా సంక్షేమం | రూ.1255.51 కోట్లు | రూ.106.49 కోట్లు |
వ్యవసాయం | రూ.3689.04 కోట్లు | రూ.35.60 కోట్లు |
పంచాయతీరాజ్ | రూ.4031.71 కోట్లు | రూ.1549.27 కోట్లు |
గ్రామీణాభివృద్ధి | రూ.2179.92 కోట్లు | - |
భారీ, మధ్య నీటిపారుదల | రూ.799.77 కోట్లు | రూ.12,658.18 కోట్లు |
చిన్న నీటిపారుదల | రూ.34.36 కోట్లు | రూ.650.32 కోట్లు |