Andhra Pradesh Telangana Officials Meeting: రాష్ట్ర విభజన అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం జరిగింది. సీఎస్‌ల కమిటీ సమావేశంలో రెండు గంటల పాటు విభజన అంశాలపై చర్చ నిర్వహించారు. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయితీ ఎటూ తేలలేదు. మూడు అంశాలపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని అధికారులు తెలిపారు. రూ. 861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు.
9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల విషయంలోనూ పంచాయితీ తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైనా సమావేశంలో సుదీర్ఘ చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబధించి ఏపీకి అధికంగా చెల్లించిన 81 కోట్ల రూపాయల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ వివరించింది. డ్రగ్స్ రవాణాపై రెండు రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎస్ అధికారులు నిర్ణయించారు.
మరో రెండు అంశాలపైనా ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై రెండు రాష్ట్రాలు ఒప్పందానికి రావాలనీ నిర్ణయించారు. మరోమారు విభజన అంశాలపై సమావేశం కావాలని ఏపీ తెలంగాణ సీఎస్‌లు నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు.