Heavy Rainfall in Andhra Pradesh : అల్పపీడన ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలోని అల్లూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవ్వగా, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు నగరంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
విజయవాడలో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 4వ డివిజన్‌లోని హరిజనవాడలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లాలో కొండ వాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమిల్లి, రౌతుగూడెం, వంకావారిగూడెం, దర్భగూడెం, పూచికపాడు కాల్వలు రోడ్లపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాటి ఆకులగూడెం, రౌతుగూడెం వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు జీలుగుమిల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు.
లంక ప్రజల కోసం మరబోట్లు ఏర్పాటు : వేలేరుపాడు మండలం కోయ మాదారం వద్ద కారుతో పాటు కొట్టుకుపోయిన ఐదుగురిని గ్రామస్థులు రక్షించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. రహదారి కొట్టుకుపోయిన బురుగులంక రేవును ఆయన పరిశీలించారు. లంక గ్రామాల ప్రజల కోసం మరబోట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమలాపురం రూరల్ పరిధిలోని అయినాపురం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది. ఇంటికి వెళ్లేటప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంతో పాటు రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జోరుగా వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. డ్రైనేజీ కాల్వలు నిండుగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయి. గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలను వాననీరు ముంచెత్తింది.
నిడదవోలు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ డిపోను వాన నీరు ముంచెత్తింది. మంత్రి దుర్గేష్ పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో మోటార్లతో నీరు తోడాలని పురపాలక అధికారుల్ని ఆదేశించారు. అల్లూరి జిల్లాలో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర రామభద్రపురం మండలం అన్నవరం వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
మరింత బలపడనున్న అల్పపీడనం: పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న రెండుమూడు రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.