AP CM Chandrababu Review on Housing : గృహనిర్మాణ శాఖపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధ సారధి వెల్లడించారు.
ఇంటినిర్మాణానికి రూ.4లక్షలు : పేదవారి సొంతింటి కల సాకారం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని పీఎమ్ఏవై( ప్రధానమంత్రి ఆవాస్ యోజన)అర్బన్-2.0 కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటినిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 60శాతం, ఏపీ ప్రభుత్వం వాటా 40 శాతం ఉండనుంది.
ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం : కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి, లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
8.5లక్షల ఇళ్లనిర్మాణమే లక్ష్యం : వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకొని, సరసమైన ధరకు నాణ్యమైన ఇళ్లు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందని ఆరోపించారు. ఇళ్లు పూర్తి అయినా పేమెంట్లు చెల్లించ లేదని, ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ (మిడిల్ ఇన్కమ్ గ్రూప్) లే అవుట్లని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఇళ్లు : జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని, ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించ లేదని, అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు.