Investigation on Mumbai Actress Issue : ముంబయి సినీ నటి వేధింపుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో నటితో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్నంగా దర్యాప్తు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలు ముంబయి వెళ్లే అవకాశాలున్నాయి.
ప్రేమ పేరిట కుక్కల విద్యాసాగర్ మోసం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముంబయికి చెందిన ఓ హీరోయిన్‌ను వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు వేధించారన్న వార్త దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ప్రేమపేరిట వెంట తిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించారని నటి ఆవేదన వ్యక్తం చేసింది. ఆపై సినీనటి, ఆమె కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బెదిరించి తమ జోలికి రాకుండా రాజీ చేసుకున్నట్లు ఆరోపించారు. వేధింపుల వెనుక వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు, ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కీలకంగా పని చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎక్స్ వేదికగా స్పందించారు.
వర్ల రామయ్య డిమాండ్ : ముంబయికి చెందిన హీరోయిన్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సీఎం చంద్రబాబును వర్ల రామయ్య కోరారు. ఓ మహిళ దారుణ దౌర్జన్యానికి గురైందని నిప్పులు చెరిగారు. ఆనాటి అధికార పెద్దల కుట్రలో ఇక్కట్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రలను కూడా వెలికితీయించాలని డిమాండ్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు : ముంబయి సినీనటికి సంబంధించిన కేసు ఇంకా దర్యాప్తులో ఉందని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా సేకరిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. దీనిపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీ తెలిపారు.
వారిని కఠినంగా శిక్షించాలి : ముంబయి నటిపై వేధింపుల అంశంలో నిజ నిర్ధరణ చేయాలని, ఆమెను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. ముంబయి నటికి సత్వరమే న్యాయం చేయాలని, వైఎస్సార్సీపీ అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని అన్నారు.
పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషం : సినీ నటిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.