IPS AB Venkateswara Rao Into Service in AP : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
IPS AB Venkateswara Rao Issue : ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని చెప్పారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఏబీవీ తెలిపారు.
రెండుసార్లు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ : రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది. అక్రమ కేసులతో జగన్ సర్కార్, వైసీపీ వీరభక్త అధికార గణం వేధించింది. ఆ తర్వాత ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది.
అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఆయనపై సర్కార్ రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్యాట్ ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఈరోజు పదవీ విరమణ చేయనున్న ఏబీవీ : ఏబీవీ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హైకోర్టు ప్రభుత్వం ఐదేళ్లుగా ఆయణ్ని సస్పెన్షన్‌లోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలిపిస్తే అది ఆయనకు తీవ్ర నష్టం కలగజేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. సుదీర్ఘమైన సర్వీసు కలిగి ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి క్యాట్ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరి కాదని అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు వీలుగా వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.
పోస్టింగ్‌లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao Vote Issue