Pension Distribution in AP: ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొందరికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని ఇలా పలు కారణాలు చూపించి చివరకు లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది.
ఈ మేరకు ఈరోజు నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయాలని ఉత్తర్వులో పేర్కొంది.
పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో గత నెల 31న జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించి దాని స్థానంలో ఈ నెలతో పాటు మే, జూన్ నెలల్లోనూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలిచ్చింది. వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పేర్కొన్నారు.
పింఛన్ పంపిణీ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది: పురందేశ్వరి - PURANDESWARI ON PENSIONS
గ్రామ సచివాలయాలకు దూరంగా ఉండే ఆవాసాలు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లోని సచివాలయాలకు దూరంగా ఉన్న ఆవాసాల్లోని పింఛనుదార్లకు సమీప ప్రభుత్వ కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీకి కలెక్టర్లు ఏర్పాటుచేయాలని ఆదేశాలిచ్చారు. ఈ పింఛన్ల పంపిణీపై తగిన ప్రచారం కల్పించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విధులు నిర్వహించాలని తెలిపారు. సచివాలయాలకు వచ్చే పింఛనుదార్లకు నీడ కల్పించడం, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు అందుబాటులో ఉంచే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని వీటికయ్యే ఖర్చులకు పంచాయతీ సాధారణ నిధిని వెచ్చించాలన్నారు. దానికి అనుగుణంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలనివ్వాలని చెప్పారు.
బ్యాంకుల నుంచి పింఛను సొమ్ము డ్రా చేసి గ్రామ సచివాలయాలకు తీసుకెళ్లేందుకు వీలుగా పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ, విద్యా కార్యదర్శులకు ఎంపీడీవోలు, పట్టణాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు మున్సిపల్ కమిషనర్లు అధీకృత లేఖలు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డ్రా చేసిన సొమ్మును పింఛన్ల పంపిణీ విధుల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందజేయాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక అబ్జర్వర్లు నియమించిన ఈసీ - special observers For Election
పింఛన్ల సొమ్మును బుధవారం నుంచి బ్యాంకుల్లో డ్రా చేసేలా ఆర్థికశాఖ ఏర్పాట్లు చేసిందని వెంటనే పంపిణీని ప్రారంభించి ఆరో తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కొందరు పింఛనర్లకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇచ్చే అధీకృత లేఖలను వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
ఈ ప్రతులను సంబంధిత ఎన్నికల అధికారులకూ పంపాలన్నారు. ప్రతిరోజూ పింఛన్లు పంపిణీ అయ్యాక మిగిలిన సొమ్మును వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి అప్పగించాలని ఆదేశించారు. వాళ్లు ఈ వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ లాగిన్లు అందజేయాలని, వారు తమ మొబైళ్లలో పింఛను పంపిణీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పింఛనుదార్ల జాబితా సిబ్బందికి అందిస్తారని, ఫింగర్‌ప్రింట్ స్కానర్ డివైజ్‌లను ఆ సిబ్బందికి డిజిటల్ అసిస్టెంట్లు అందజేస్తారని చెప్పారు. పింఛన్ల పంపిణీ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు వివరించాలన్నారు.
ఆధార్ ఆధారిత పింఛను పంపిణీ కుదరకపోతే రియల్‌టైమ్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ విధానంలో పంచాలని తెలిపారు. పింఛన్లు పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ప్రచారం చేయకూడదని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పింఛనుదార్లు అందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంచడం సాధ్యం కాదని, వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛను సొమ్ము జమ చేసేందుకు ఇబ్బందులున్నాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. వాలంటీర్లు 2 లక్షల 66 వేల మంది ఉండగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు లక్షా 27 వేల మందే ఉన్నారని తెలిపారు.
వీరిలో వైద్య సేవలందించే ఏఎన్ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు 12 వేల 770 మంది, వ్యవసాయ అనుబంధ సేవలందించే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య సహాయకులు 14 వేల 232 మంది, విద్యుత్ పనులు చేసే ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 6 వేల 754 మంది సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొందరు బూత్ స్థాయి అధికారుల విధులు నిర్వహిస్తుండటం, మరికొందరు ఎన్నికల సంబంధిత శిక్షణకు హాజరవుతున్నందున వీరితో ఏప్రిల్, మే నెలల్లో పింఛన్ల పంపిణీ కుదరబోదని తెలిపారు. వీరందరినీ మినహాయిస్తే ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, వాలంటీర్ల మాదిరి ఈ సిబ్బందికి పింఛనుదార్ల ఇళ్లు కచ్చితంగా తెలియక, పింఛను పంపిణీకి ఎక్కువ సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు.
ఇలాంటి జాప్యం ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని వివరించారు. పింఛనుదార్లు అందరికీ తమ గ్రామ, వార్డు సచివాలయాలు ఎక్కడున్నాయో తెలుసని వారు తమ సౌలభ్యం మేరకు ఈ సచివాలయాలకు రావొచ్చని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకోవచ్చని అన్ని సచివాలయాల్లో ఐటీ హార్డ్‌వేర్, కనెక్టివిటీ అందుబాటులో ఉందని తెలిపారు.
ఉద్యోగుల పని వేళలు పెంచొచ్చని, పంపిణీని సులభంగా పర్యవేక్షించే వీలుందని, ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే పరిష్కరించే వీలుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీకి మొగ్గు చూపినట్లు పేర్కొన్నారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పింఛను జమ చేసే విధానమూ సాధ్యం కాదని ఉత్తర్వులో పేర్కొన్నారు.
పింఛనుదార్లలో కొందరికి బ్యాంకు పాసుపుస్తకాలు లేకపోవడం, మరికొందరి బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోవడం, ఆ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కాకపోవడంతోపాటు మరణించిన పింఛనుదార్లకూ పింఛను జమయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు పింఛను పొందేవారంతా పేదవాళ్లు కావడం, వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు పింఛను సొమ్మును బ్యాంకులో డ్రా చేయడం సాధ్యం కాదని తేల్చినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.