AP New Ration Cards 2024 : ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన పేదలకు త్వరలో నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది.
ఈ మేరకు వైఎస్సార్సీపీ సర్కార్ చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే తొలి విడతగా రూ.1000 కోట్లు, తర్వాత రెండో విడతగా రూ.674.40 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో రూ.89 లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
రేషన్ వాహనాలపై త్వరలో నిర్ణయం : అదేవిధంగా వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీపై సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. 6000ల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4,000 పైగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000లు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000లకు మించితే, ఆ కుటుంబాలు రేషన్ కార్డుకు అర్హులు కావని గత సర్కార్ నిర్ణయించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దయ్యాయి. వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాయి. తమకు వచ్చేదే తక్కువ జీతమని, రేషన్ కార్డుల తొలగింపు వల్ల నష్టపోతున్నామని వారంతా ఆవేదనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వమైనా కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా కార్డులు జారీ చేయాలని వారు కోరుతున్నారు.
ఏం చేయబోతున్నారు? :
- నూతన రేషన్ కార్డుల మంజూరు
- కుటుంబాల విభజన
- కుటుంబ సభ్యుల చేర్పు
- కుటుంబ సభ్యుల తొలగింపు
- చిరునామా మార్పు
- కార్డులను సరెండర్ చేయడం
సాంకేతిక సమస్యలతో ప"రేషన్"- కేవైసీ అప్డేట్‌కు గడువు పెంచిన ప్రభుత్వం - Ration Card KYC Update