Amma Adarsha school Repair Works : ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన పాఠశాలలో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. జూన్ 12న బడులు తెరిచే నాటికి మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జోరందుకున్నాయి. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 3వేల2 వందల సర్కారు పాఠశాలలుండగా 2 వేల5 వందల పాఠశాలలో రూ. 100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పనులను చేపట్టారు.
మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరమ్మత్తులు, విద్యుదీకరణ, తాగునీరు సౌకర్యం, మరుగుదొడ్ల పునరుద్ధరణ, కొత్తవాటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ పనులు 50శాతం వరకు పూర్తయ్యాయి. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వంద శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు దృష్టి సారించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులన్నీ మహిళా సంఘాల ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3 నుంచి 5లక్షల లోపు పనులున్న స్కూళ్లలో పనులు చేసేందుకు మహిళా సంఘాలు ఆసక్తి చూపాయి. కాని అంతకంటే ఎక్కువ అంచనాలు ఉన్న చోట మహిళ సంఘాలు వెనకడుగు వేశాయి. అలాంటి చోట కమిటీ అంగీకారం మేరకు ఇతరులకు పనులు అప్పగిస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, గతంలో పనులు చేపట్టిన గుత్తేదారుల జోక్యం అధికం కావడం చాలాచోట్ల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. స్కూళ్లు తెరిచే సమయానికి ఎలాగైనా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.
ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత : సందీప్ కుమార్ సుల్తానియా - PR Dept Secretary Visit
Amma Adarsha School Committees In Telangana : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పరిపాలన అనుమతి పొందిన పనులకు 25 శాతం నిధుల్ని ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ చేశారు. కానీ పనులు చేస్తున్న సంఘాలకు, గుత్తేదారులకు ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదు. చేసిన పనులు చేసినట్లుగా ఎంబీ రికార్డు చేసి బిల్లులు ఇప్పిస్తే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో మన ఊరు- మన బడి కింద చేపట్టిన పనులకు సైతం సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా చాలాచోట్ల పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ పరిస్థితి లేకుండా చేసిన పనులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాలు, గుత్తేదారులు కోరుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతంలో మన ఊరు- మన బడి కింద రూ. 83లక్షలు మంజూరు కాగా ఐదు గదుల నిర్మాణం పూర్తయింది. బిల్లులు రాలేదని గుత్తేదారు మిగిలిన పనులను ఆపేశారు. ప్రస్తుతం పాత భవనంలోనే పాఠశాల నడవాల్సి ఉంది. ఆ పాఠశాలకే అమ్మ ఆదర్శ పాఠశాల కింద తాజాగా పనులు మంజూరు చేశారు. పాత భవానానికి మరమ్మత్తులు చేసే బదులు కొత్త భవనం పనులు పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వాటిని గుర్తించి ఈ విద్యాసంవత్సరమే పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పాఠశాలు తెరిచేనాటికి ఏకరూప దుస్తులు సైతం సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ పనులూ మహిళా సంఘాలకే అప్పగించింది. అంతే కాకుండా పాఠశాల పారిశుధ్య నిర్వాహణ, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, పాఠశాల నిర్వాహణ బాధ్యతలు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే అప్పగించింది. బళ్లు ప్రారంభమయ్యాక ఈ పనులపై దృష్టి సారించనుంది.
అమ్మ ఆదర్శ స్కీంలో భాగంగా పాఠశాలల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం మాకు అప్పజెప్పింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా స్కూళ్ల మరమ్మతు చేయిస్తున్నాం. ఆ బిల్లులు ఇంకా రాలేదు. పనులు పూర్తయ్యాక డబ్బులు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. స్కూళ్లు తెరిచే సమయానికి ఎలాగైనా పనులు పూర్తి చేస్తాం. -మహిళా సంఘాలు
'ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు'