Alliance Leaders Election Campaign in AP : ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో కూటమి నేతలు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింట ప్రచారం చేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలు భారీగా టీడీపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని పలువురు నేతలు అంటున్నారు.
ఊరూవాడా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం- టీడీపీలోకి భారీగా చేరికలు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య వత్సవాయి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాళ్లూరు, మాచినేనిపాలెం, ఖమ్మంపాడు గ్రామాల్లో పర్యటించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. వైసీపీ అరాచకపాలను తరిమికొట్టాలని శ్రీరామ్ తాతయ్య అన్నారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఇబ్రహింపట్నంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలతో నియోజకవర్గాల్లో పర్యటన : రాష్ట్రాభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వసంత కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష జి.కొండూరు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్‌ను, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి మండలం బాసినపాడులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. కరపత్రాలు పంచి సైకిల్ గూర్తుకు ఓటు వేయాలని కోరారు.
సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు. కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కలసి లావనూరు, ముచ్చుమర్రి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ వీధికి రోడ్డు వేయలేదంటూ ఓ మహిళ పుట్టా సుధాకర్ యాదవ్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నందలూరు మండలం పాటూరులో ప్రచారం నిర్వహించారు.
కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి : కూటమి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. రోడ్‌షో నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఐదేళ్ల అరాచ పాలనను తట్టుకోలేని ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నారని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు, సీసీరోడ్లు నిర్మిస్తామని సురేంద్రబాబు స్థానికులకు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల నుంచి ఆయనకు మంచి స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ తనకే ఓటు వేయాలని బేబీనాయన అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా పెరుగుతున్న వలసలు : వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరకలు పెరిగాయి. వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నాయుడు బాబు, వైసీపీ కీలక నేత పంగ బావాజీనాయుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లి, బొంతలపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బత్తలపల్లి పంచాయతీలో 100 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. వారందరికి కందికుంట వెంకటప్రసాద్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరులో సుమారు వందమంది వార్డు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి నారాయణ సమక్షంలో వారంతా పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని నారాయణ హామీ ఇచ్చారు.
జోరుగా కూటమి నేతల ప్రచారాలు- అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు
ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు - వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు