Alliance Candidates Nominations in AP: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఒక పక్క ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలను ఓడించటమే లక్ష్యంగా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూనే, నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రేపటితో గడువు ముగియనుండటంతో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసుకోవడంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. మంగళవారానికి శాసనసభ స్థానాలకు 620, లోక్‌సభ స్థానాలకు 111 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
సీఎం రమేష్ నామినేషన్: అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శాస్త్రోత్తంగా పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం అనుచరులతో కలిసి సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి నామినేషన్ వేయడానికి బయలుదేరారు.
విశాఖపట్నం: విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గణబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా అందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమి అభ్యర్థిగా తనని గెలిపించి చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని గణబాబు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా: అనంతపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్‌కు భారీ జనం మధ్య కొనసాగింది. ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని భారీ గజమాలతో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు ఘనస్వాగతం పలికారు. కళాకారుల నృత్యాలు, డప్పు, వాయిద్యాలు నడుమ అట్టహాసంగా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ర్యాలీ భారీ జనం మధ్య జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఉరవకొండ రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించి, నామినేషన్ వేశారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేసిన టీడీపీకే ఓటు: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్ధన్ నేడు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు 20 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపేందుకు తమ గ్రామం నుంచి ఒంగోలు వరకు మహిళలు తో కలిసి పాదయాత్ర నిర్వహించామని గ్రామస్థులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. 700 పైగా మత్స్యకారులతో పాదయాత్ర చేస్తున్నామని, మత్స్యకారులకు సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి దామచర్ల జనార్ధన్ మాత్రమే అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తుపై వేసే దిశగా తమ వంతు కృషి చేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు.
భారీ ర్యాలీ మధ్య రెడ్డప్పగారి మాధవి నామినేషన్: కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మాధవి ఆమె స్వగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో కడప ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ర్యాలీలో డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ, టపాసులు పేల్చుతూ, కేరళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగింది. దారి పొడవున మాధవి ప్రజలకు అభివాదం చేస్తూ తెలుగుదేశం పార్టీ చిహ్నాన్ని చూపిస్తూ ఓటు వేయాలని కోరారు. మాధవి నామినేషన్ అనంతరం కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజద్ భాష నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు.
పెందుర్తి: ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజెేపీ పార్టీలకు చెందిన వేలాదిమంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ సవిత భారీ జనసందోహం నడుమ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్లో వీరంగం సృష్టించిన వైఎస్సార్సీపీ నేతలు: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్సార్సీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్సీపీ నేతలు హల్చల్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. బైకులకు సైలెన్సర్లు తీసి హంగామా చేశారు. డీజే వాహనాలతో పెద్ద పెద్ద శబ్దాలతో మైకులు పెట్టారు. కనీస అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పోలీసులు పట్టించుకోలేదు. పూర్తిగా వైయస్సార్ పార్టీ కార్యకర్తల మాదిరిగా పోలీసులు ఇతర ఎన్నికల అధికారులు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. చివరికి మహిళలతో డాన్సులు కూడా వేయించారు. నామినేషన్ ర్యాలీకి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ హాజరయ్యారు.
ప్రశాంత వాతావరణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నామినేషన్: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎటువంటి ర్యాలీలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులతో కలిసి అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన సూర్యనారాయణ రెడ్డి ఆర్వో మాధురికి నామపత్రాలను సమర్పించారు. గతంలో కంటే అత్యధిక మెజార్టీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరిల నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సర్వమత ప్రార్థనల అనంతరం పాదయాత్రగా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన జెండాలతో నగర ప్రధాన వీధులు పసుపు, ఎరుపు మయమయ్యాయి.
శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ నామినేషన్ వేశారు. అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమకు నిరాజనాలు పడుతున్నారని, టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ వేశారు. నరసింహారెడ్డికి మద్దతు తెలుపుతూ ఆశీర్వదించేందుకు ప్రజలు భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా టీడీపీ, అభిమానులు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా నిలిచేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
రెండోరోజు జోరుగా నామినేషన్ల ప్రక్రియ - ర్యాలీలతో తరలివస్తున్న నేతలు - Nominations in AP
మద్యం దుకాణాల వద్ద బారులు: పార్వతీపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ శాసనసభ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావు, అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తనుజారాణి నామినేషన్ వేశారు. ఒకవైపు ర్యాలీ జరుగుతుండగానే మరోవైపు వైఎస్సార్సీపీ శ్రేణులు వైన్ షాపులువైపు అడుగులు వేశారు. ప్రతి మద్యం దుకాణం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు.