Hopes on Expansion of Gannavaram Airport with International Standards : రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. దీంతో రాజధానికి అతి చేరువలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు కూడా పరుగులు పెట్టే అవకాశం ఉందనే చర్చలు సాగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 22 డొమెస్టిక్ విమాన సర్వీసులు, వారానికి రెండుసార్లు అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్నారు. తాజాగా విజయవాడ నుంచి ముంబయికి సర్వీసులు మొదలు పెట్టారు. రోజూ 3 వేల 300 మంది రాకపోకలు జరుపుతుండగా ఆక్యుపెన్సీ రేషియో రేటు 95 శాతం పైగా ఉంది.
'గన్నవరం నుంచి విశాఖ మీదుగా కోల్‌కతా వరకు, అలాగే వారణాసికి కొత్తగా సర్వీసులు ప్రతిపాదించారు. థాయ్‌లాండ్, శ్రీలంక వెళ్లేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. వీటితో పాటు గతంలో ఆగిపోయిన గన్నవరం- సింగపూర్ సర్వీసును పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటితో పాటు చెన్నై మీదుగా కోయంబత్తూరు వరకు, అలాగే కొచ్చిన్‌కు ప్రత్యేక విమానాలు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం దిల్లీకి నడుపుతున్న సర్వీసులు సరిపోనందున మరో రెండు సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించినందున సర్వీసుల పెంపు సులువు అవుతాయి.' -కూటమి ప్రజా ప్రతినిధులు వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ, కేశినేని శివనాథ్, విజయవాడ ఎంపీ
Hopes of Developing Vijayawada Airport : ప్రస్తుతమున్న టెర్మినల్ వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటోంది. దీంతో కొత్త టెర్మినల్ వస్తేనే కొత్త సర్వీసులకు అవకాశముంటుంది. టెర్మినల్ నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. నిర్వాసితుల సమస్య కొలిక్కి వచ్చిందని, టెర్మినల్ నిర్మాణ పనులు ఊపందుకుంటాయని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి చెబుతున్నారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి అవకాశం ఏర్పడటంతో వ్యాపార, వాణిజ్య రంగాలు, విదేశీ పెట్టుబడులు రావడానికి గన్నవరం విమానాశ్రయం కీలకం కానుంది. దీంతో విస్తరణ పనులు త్వరితగితన పూర్తిచేసి కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.