Adviteeya 2024 Talent Show Organised in Siddhartha Womens College : ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి మనో వికాసం పెంచడమేగాక కెరీర్‌లో ఉన్నత స్థానాల్లో ఉండేందుకు దోహదం చేస్తాయి. అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. అందుకే విభిన్నఅంశాలపై పోటీలు నిర్వహించింది విజయవాడ మహిళా కళాశాల. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభానైపుణ్యాలు వెలికితీసేందుకు ప్రయత్నించింది. వివిధ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందడిగా సాగిన "అద్వితీయ-2024" విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందామా.
ఉత్సాహభరితంగా పాల్గొన్న విద్యార్థులు : చదువుతో పాటు అన్ని అంశాల్లో రాణిస్తే కెరీర్‌లో సులువుగా నిలదొక్కుకోగలరు. ఇది దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన కార్యక్రమమే అద్వితీయ-2024. ఈ ఇంటర్ కాలేజియేట్ అకడమిక్ పోటీల్లో సత్తా చాటాలని వందల మంది విద్యార్థులు తరలివచ్చారు. వ్యాసరచన, టెక్నాలజీ, ఆర్ట్, షార్ట్‌ఫిల్మ్స్ వంటి వివిధ విభాగాల్లో ప్రతిభాపాటవాలతో ఆకట్టున్నారు. విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో అద్వితీయ -2024 కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'
సృజనాత్మక నైపుణ్యాలతో మెప్పించారు : సిద్ధార్థ కళాశాల, లిటరరీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. వివిధ కళాశాల నుంచి వందల మంది విద్యార్థులు పాల్గొని సృజనాత్మక నైపుణ్యాలతో మెప్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో సిద్దార్థ మహిళా కళాశాలలో సందడి నెలకొంది. వ్యాసరచన పోటీల్లో పాల్గొని ఇచ్చిన అంశం పై వ్యాసాలు రాశారు. లఘ చిత్రాలు, యాడ్ ఫిల్మ్‌మేకింగ్ పోటీల్లో పాల్గొని తమ నటనతో ఆకట్టుకున్నారు. పోటిల్లో పాల్గొని తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించారు.
డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు : వ్యాపారంలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం పై చర్చించారు. ఉపాధి, వ్యాపారం ఇలా ఏ రంగంలో రాణించాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం దీనిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో వెల్లడించారు. వినూత్న ఆలోచనలతో చేసి ఆకట్టుకున్నారు. సంప్రదాయ కళఅయిన డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు. డప్పు దరువేస్తూ హుషారుగా నర్తిస్తూ అద్వితీయ ప్రతిభతో అలరించారు ఎంతో మంది అమ్మాయిలు. బిడియం పోగొట్టి ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని అంటున్నారు. కమ్యునికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు ఇదో చక్కని వేదిక అని చెబుతున్నారు.
"ప్రతి విద్యార్థి జీవితంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. గతంలో కాలేజీ యాజమాన్యం, అధ్యాపకుల ప్రొత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఎంతో మంది విద్యార్థులు వివిధ కాలేజీల నుంచి వచ్చి పాల్కొనడమే కాకుండా బహుమతులు గెలుచుకుంటున్నారు. ఈ కార్యక్రమాల నిర్వాహణ బాధ్యత కూడా మేమే చూడడంతో నాయకత్వ లక్షణాలు అలవరచుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తే మాలోని ప్రతిభను బయట ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం లభిస్తుంది." - విద్యార్థులు
అందరు విద్యార్థులు చదువుల్లో ముందంజలో ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో నైపుణ్యం ఉంటుంది. ఆ ప్రతిభ నిరూపించుకునేందుకు అద్వితీయ-2024 ఎంతో ఉపయోగపడిందని అంటున్నారు విద్యార్థులు. సంప్రదాయ కళలు, కొలాజ్ మేకింగ్, చిత్రలేఖనం, షార్ట్‌ఫిల్మ్, యాడ్‌ఫిల్మ్ మేకింగ్, పోస్టర్ ప్రజంటేషన్ వంటి 9 విభాగాల్లో ప్రతిభ చాటుకున్నారు.
టాలెంట్ బయటపెట్టుకునేందుకు చక్కటి అవకాశం : గెలుపోటముల మధ్య తేడాను, పోటీతత్వం, సహజ నైపుణ్యాలు తరచి చూసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అంటున్నారు అధ్యాపకులు. 200మందికి పైగా విద్యార్థులు పాల్గొని అద్వితీయ-2024ను విజయవంతం చేశారని వివరించారు. అలాగే టాలెంట్ బయటపెట్టుకునేందుకు అద్వితీయ-2024 వేదికగా చేసుకున్నారు విద్యార్థులు. కాలేజీలో నేర్చుకునే అంశాలే మా భవితకు పునాదులు. ప్రగతికి సోపానాలని అంటున్నారు.
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు