Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల్లో ఒకరైన సుప్రియా స్టేట్మెంట్ను సైతం నమోదు చేసింది.
మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది : ఈ క్రమంలో పిటిషన్ ఎందుకు దాఖలు చేసారని నాగార్జునను ధర్మాసనం ప్రశ్నించగా, తనపై అసత్య ఆరోపణలు చేసినట్లు హీరో నాగార్జున కోర్టుకు తెలియజేశారు. అలానే తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్స్ వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకుల పైనా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన వాంగ్మూలంలో వివరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్య ఆరోపణలన్న ఆయన, రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని పేర్కొన్నారు. అనంతరం న్యాయస్థానం విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది.
ఈనెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం : కోర్టు వాదనల అనంతరం నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ, మెుదటి సాక్షి సుప్రియ వాంగ్మూలం రికార్డ్ చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తారని తెలిపారు. అనంతరం ఈనెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేశామన్న ఆయన, మంత్రిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున వాంగ్మూలం ఇచ్చారని వివరించారు.
మరోవైపు మంత్రి కొండ సురేఖ తరపు కౌన్సిల్స్ తిరుపతి వర్మ స్పందిస్తూ, మంత్రిపై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలలో తేడాలు ఉన్నాయన్నారు. నాగార్జున పిటిషన్లో ఒకటి చెప్పారని, వాంగ్మూలల్లో మరొకటి చెప్పారని అన్నారు. ఆయన కోడలు సుప్రియ వాంగ్మూలలో మరొకటి చెప్పారని తెలిపారు. ఆమెను సాక్షిగా ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలని అన్నారు. ఈనెల 10వ తేదీన మరొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుందని, ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఒకవేళ సాక్షుల పరిగణలోకి తీసుకొని మంత్రికి నోటీసులు జారీ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని బదులిచ్చారు. మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టులపై డీజీపికి బుధవారం ఫిర్యాదు చేస్తామని తిరుపతి వర్మ వెల్లడించారు.
మళ్లీ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ - ఈసారి ఏమన్నారంటే? - Minister Konda Surekha Comments