Acharya Nagarjuna University Students Protest Over Food Quality : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థినులు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగారు. వసతి గృహంలో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని గత కొన్ని రోజులుగా కంప్లైంట్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు. మధ్యాహ్నం భోజనంలో కప్ప రావడంతో విద్యార్థినులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త వహించి, అక్కడితో విషయాన్ని సద్దుమణిగించారు. అయితే రాత్రి భోజనంలో మరోసారి పురుగులు రావడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహానికి గురై, ఒక్కసారిగా వసతి గృహం బయటకు వచ్చి ధర్నాకు దిగారు.
రిజిస్ట్రార్‌ను చుట్టుముట్టిన విద్యార్థినులు : ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ బయటకు వచ్చి ధర్నా చేయాలని నిర్ణయించారు. ఐతే విద్యార్థినులను బయటకు రానీయకుండా భద్రతా సిబ్బంది గేట్లు వేశారు. దీంతో వారు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చారు. వైస్ ఛాన్స్లర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యపై సత్వరమే స్పందించాలని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంను చుట్టుముట్టారు. రోజూ పురుగుల అన్నమే పెడుతున్నారని ఆయన వద్ద వాపోయారు. గత మూడు రోజులుగా అధికారులకు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విద్యార్ధినులతో రిజిస్ట్రార్ మాట్లాడి శనివారంలోపు సమస్యను పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ సింహాచలం హామీ ఇచ్చారు.
తాగునీటి ట్యాంకులో వెంట్రుకలు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆహార నాణ్యత లోపించిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అందులో భాగంగానే ఇవాళ నాగార్జున యూనివర్శిటీలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాత్కాలిక ఛైర్మన్ రామ్మోహన్ రావు, కార్యదర్శి భరత్ గుప్తా, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసులు వసతి గృహంలోని మెస్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. స్టూడెంట్స్‌తో అధికారులు చర్చించారు. మెస్ పరిసరాలను చెక్ చేసిన అధికారులు, అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. తాగునీటి ట్యాంకులో తల వెంట్రుకలు ఉండటాన్ని గుర్తించిన అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. స్టాఫ్ ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పురుగుల అల్పాహారం
'పిల్లలకు బిర్యానీలు, చిరుతిళ్లు తీసుకురావద్దు - బయట నుంచి తెచ్చిన ఆహారం తీసుకోవద్దు'