Young Woman Committed Suicide In Jeedimetla : తనను ప్రేమించాలని యువతి వెంటపడ్డాడు ఆ యువకుడు. కాదంటే ఆత్మహత్యే శరణ్యమని నమ్మించాడు. తీరా నమ్మి ప్రేమిస్తే, పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగింది.
బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీనగర్లో నివాసముండే అఖిల(22) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేది. షాపూర్నగర్కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యలకు తెలియడంతో బంధువుల సమక్షంలో అఖిల్ సాయిగౌడ్ను పిలిపించి మాట్లాడారు. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను అంగీకరించారు. ఏడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
గత మూడు, నాలుగు నెలల నుంచి అఖిలపై వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్నచిన్న విషయాలకు రోడ్డుపైనే దుర్బాషలాడుతూ కొడుతుండేవాడు. దీనికితోడు అతను పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో నిందితుడు సాయిగౌడ్ను అరెస్టు చేశారు.
Lovers Suicide in Nalgonda : మరోవైపు నల్గొండ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్ కాలనీకి చెందిన ధనలక్ష్మి(24)కి గతంలోనే వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. అదే కాలనీకి చెందిన దుర్గాప్రసాద్(20) సీసీ కెమెరాలు అమర్చే పని చేస్తున్నారు. వీరిరువురు గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు.
తమ మధ్య ఉన్న అనైతిక సంబంధం సమాజం హర్షించదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ, కుక్కడం రైల్వే స్టేషన్ల మధ్య ఐలాపురం వద్ద గూడ్స్ ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.