Wife Built Temple in Mahabubabad : కొందరు మహిళలు బతికుండగానే భర్తకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో, తాను మాత్రం మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచింది. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి, తుదిశ్వాస విడిచిన భర్తకోసం ఏకంగా గుడినే కట్టించింది. ఆయన జ్ఞాపకాలు, అనుభూతులు చెదిరిపోకుండా గుడి రూపంలో పునర్నిర్మించుకుంది. భర్త పేరిట అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది.
వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్‌కు మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చందిన బానోతు హరిబాబు, కల్యాణి దంపతులు. వీరికి 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతానం ఎవరూ లేరు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్యంపై వీధి కాటువేసింది. కరోనా మహమ్మారి ఇరువురి జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్త హరిబాబును తన నుంచి దూరం చేసింది.
మూడేళ్ల క్రితం భర్త హరిబాబు కొవిడ్ కారణంగా మృతి చెందడంతో కల్యాణి ఒంటరిగా మారారు. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె, తన భర్త ఎడబాటు తీవ్రంగా కుమిలిపోయారు. అనంతరం ఓ దృఢ సంకల్పానికి వచ్చారు. భర్త రూపం ఎప్పటికీ కళ్లముందే కనిపించేలా, ఆయన నిలువెత్తు విగ్రహం తయారు చేయించి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు.
కల్యాణి సుమారు రూ. 20లక్షల వ్యయంతో భర్తకు గుడి కట్టారు. రాజస్థాన్ నుంచి విగ్రహం తెప్పించి ఆవిష్కరించారు. ఆమె, తన భర్త జ్ఞాపకార్థం నిర్మించాలనుకున్న ఆలయ కల బుధవారం నెరవేరింది. హరిబాబు రూపం, పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని గుడి నిర్మించినట్లు కల్యాణి పేర్కొంటున్నారు. బంధువులు, స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"నా భర్త హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మరణించాడు. మాకు పిల్లలు లేరు. ఆయన దూరం కావడంతో మానసికంగా వేదనకు గురయ్యాను. ఆయన చిరకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం నా భర్త గుడి నిర్మించాలని నిశ్చయించుకున్నాను. ఇవాళ గుడి నిర్మాణం పూర్తి అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనెప్పుడు నా కళ్ల ముందే ఉంటారన్న ఊహే అద్భుతంగా ఉంది.". - కల్యాణి, గుడి నిర్మించిన మహిళ
భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : హైకోర్టు - DELHI HC ON MENTAL CRUELTY
సర్కార్ వారి సొమ్ము కోసం కక్కుర్తి- అన్నాచెల్లెళ్ల పెళ్లి- చివరకు దొరికారిలా!