Baby Boy Sale in Bapatla : నవ మాసాలు మోసి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి కడుపు తీపి గుర్తుకు రాలేదేమో! ముద్దు లొలికే ఆ బిడ్డను అమ్మేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచి పోయిందేమో! పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో! డబ్బు కోసం ఆ చిన్నారిని వేరేవారికి విక్రయించింది. చివరకు డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఈ గుట్టును రట్టు చేసింది.
'నిద్రపోతున్న నన్ను లేపి స్నానం చేయిస్తే నా కోసమే కదా అని మురిసిపోయా. మంచి దుస్తులు తొడిగితే మా అమ్మ ఎంతో మంచిదని సంబరపడిపోయా. ఇతరుల చేతిలో నన్ను పెడితే వారిని చూడాలని అనుకున్నాను. అలా అనామకురాలి చేతిలో పెట్టిపోతే అమ్మే కదా వెంటనే వస్తుందిలే అని ఎదురుచూశా. కాలం కరిగిపోతున్నా ఎంతసేపటికీ నువ్వు రాకపోయేసరికి నాలో భయం మొదలైంది అమ్మా' అని ఆ మూడు నెల పసికందు ఆవేదన. గుండెలు బరువెక్కెలా చేసే ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.
Baby Selling Incident Case Bapatla : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్లకు చెందిన వెంకటేశ్వరమ్మ మూడు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు శిశువు కావాలని మూడు వారాల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాగమణి ఆమెను సంప్రదించింది. అందుకు లక్ష రూపాయలు ఇస్తానని బేరసారాలు జరిపింది. దీనికి సరేనన్న వెంకటేశ్వరమ్మ తన బిడ్డను నాగమణికి అప్పగించింది.
ఇందులో భాగంగా వెంకటేశ్వరమ్మకు నాగమణి రూ.80 వేలు చెల్లించింది. మిగతా రూ.20 వేలు తర్వాత ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత ఆమె మిగతా నగదు ఇవ్వమని అడిగితే నాగమణి సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరమ్మ బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కన్నతల్లే శిశువును విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది.
కావలి నుంచి ఆ మగబిడ్డను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆ శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలసదనానికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల సీఐ మహమ్మద్ జానీ తెలిపారు. శిశువిక్రయాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇటువంటి వాటిపై తమకు సమాచారం అందించాలని సీఐ పేర్కొన్నారు.