Parking Murder in Hyderabad : ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, చివరికి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. ఆవేశంతో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న కారణాలతో హత్యలు చేయడం వంటివి సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఈ వార్త చదివితే నిజ జీవితంలోనూ ఇలా జరుగుతుంది అన్న అనుమానం కలగకమానదు.
Man Brutally Murdered In Gachibowli : తాజాగా గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో సాయంత్రం సమయం అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో గతేడాది జరిగిన గొడవతో కక్షకట్టిన సదరు వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలిలో ఈ దారుణం జరిగింది.
ఇన్‌స్పెక్టర్ వెంకన్న కథనం ప్రకారం : యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్(54) కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ విల్లాస్‌లో ఉంటున్నారు. అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్ వినయ్(28)తో కలిసి సీఎస్ డెలాయిట్ ఇన్ హోటల్ నడుపుతున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూం కోసం గది అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్ రూం ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరకులు దించుకుంటున్నారు. ఆ సమయంలో ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్(35) అనే వ్యక్తి శ్రీనివాస్‌తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతడిపైనే వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు.
దీంతో తన పరువు తీశాడని కక్ష కట్టిన మహేందర్ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. గురువారం సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్‌లోకి ప్రవేశించి సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్‌పై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్, హోటల్ సిబ్బంది మహేందర్‌ను అడ్డుకుని శ్రీనివాస్‌ను కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.45కు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీనివాస్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు మరో కుమారుడు ఉన్నారు. అవివాహితుడైన మహేందర్ ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెట్టకుండా తిరుగుతూ రోజులు గడుపుతాడని కాలనీలోని స్థానికులు తెలిపారు.