A Boy Died After Falling Under Tractor Tires in Peddapalli : ఈ సంఘటనను చూస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అనిపించక మానదు. తన మనవడిని రోజూ భుజాలపై ఎత్తుకుని ఆడించేవాడు ఆ తాత. గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చేవాడు. తను కూడా ఓ చంటి పిల్లాడిలా మారిపోయి, తన గారాల మనవడితో ఆటలాడుకునేవాడు. ఇలా ఆటలాడుతుంటే ఆ చిన్నారి నవ్వులు చూసి మురిసిపోయి కడుపు నింపుకునేవాడు. ఎక్కడికి వెళ్లినా తన మనవడిని ముద్దాడందే బయటకు వెళ్లేవాడు కాదు. కానీ చివరకు ఆ తాత చేతుల్లోనే ఆ మనవడు ప్రాణాలొదిలాడు. ట్రాక్టర్ను పార్కింగ్ చేసే క్రమంలో చూసుకోకుండా బాలుడిపైకి పోనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెలను పిండేసే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ఓంకార్, భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పటి వరకు బాగానే ఆడుకున్నాడు ఆ పిల్లాడు. ఇంతలోనే తన తాత ప్రభాకర్ రోజులాగే వ్యవసాయ పనులకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి ట్రాక్టర్ను ఓ చోట నిలిపేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే తాత వచ్చాడనే ఆనందంలో ఆ బాలుడు ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ విషయాన్ని గమనించని ప్రభాకర్, ట్రాక్టర్ను అలాగే వెనక్కి పోనిచ్చాడు.
ఈ క్రమంలో మనవడు ట్రాక్టర్ టైర్ల కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని పెద్దపల్లి దవాఖానాకు తరలించగా, మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో అంతా తనవల్లే జరిగిందని ప్రభాకర్ బోరున విలపించాడు. దేవుడా ఎందుకు ఇలా నా మనవడిని నాకు దూరం చేశావు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తన మనవడి మరణంతో ఆ తాతయ్య ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు.
మెదక్ జిల్లాలోనూ : ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. గత నెలలో మెదక్ జిల్లాలో ఇలానే ట్రాక్టర్ ట్రాలీ కింద పడి రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.