Old Woman YouTube Videos : కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పడానికి ఈ బామ్మనే ఉదాహరణగా చెప్పవచ్చు. టాలెంట్ ఉంటే వయసుతో సంబంధం లేదని చాటిచెప్పింది. ఆ బామ్మ వయసు 70 ఏళ్లు పైనే. అయితేనేం మన తెలుగు హీరోలు చెప్పే డైలాగ్‌లను ఊదిపడేస్తోంది. వారిలాగే ఫైటింగ్ చేసి విలన్లను చితక్కోట్టేస్తుంది. ఆ బామ్మ చేసిన వీడియోలు యూట్యూబ్‌లో తెగ వైరల్ అయి యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అప్పటివరకు నీకెందుకు అన్న గ్రామస్థులే.. శభాష్ అప్పలమ్మ నీవల్ల మన ఊరు అందరికీ తెలుస్తోందని మెచ్చుకుంటున్నారు.
ఇప్పుడే చెప్పేశాం కదా ఆ అవ్వ పేరు అప్పలమ్మ అని, ఆమెది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కర్రివాని పాలెం. అవ్వది మత్స్యకారుల కుటుంబం. రోజువారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త తెచ్చే చేపలను ఊరూరా తిరిగి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. పిల్లలు ముగ్గురికి పెళ్లిళ్లు చేసి హరే రామ అనుకుంటూ బాధ్యతలు పూర్తిగా విడిచిపెట్టి ఇంటి వద్దనే ఉంటుంది. మనవరాళ్లు, మనవళ్లతో కలిసి రోజులు గడిపేది. గత కొన్నేళ్లుగా అవ్వ వయోభారంతో ఇంటికే పరిమితం అయింది.
అప్పుడే అసలు కథ ప్రారంభం అయింది. మూడేళ్ల క్రితం అప్పలమ్మతో మనవడు శివ సరదాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వాటికి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి కాస్త పెద్ద వీడియోలు తీయడం ప్రారంభించారు. అలాగే సినిమా ఫైట్ల అనుకరణ సీన్లు తీయడం మొదలు పెట్టారు. అందులో ఛత్రపతి, పుష్ప సినిమా డైలాగ్‌లు ఉన్నాయి. అప్పుబాలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఈ వీడియోలు అన్ని పెట్టేవారు.
అప్పలమ్మ, వీరి పక్కింటబ్బాయి బాలు, అవసరం అయితే ఊళ్లో పిల్లలు, యువకులు కూడా వీడియోల్లో నటిస్తారు. ఈ వీడియోలు అన్ని శివ దర్శకత్వంలో తీస్తారు. ఈ క్రమంలో అప్పలమ్మ తనదైన శైలిలో నటించి అందరినీ ఆకట్టుకుంటుంది. అప్పలమ్మ వీడియోలు చూసిన చాలామంది ఇలాగే నటించు ఈ రంగంలో కచ్చితంగా ఎదుగుతావంటూ ఫోన్లు, కామెంట్లు చేసిన వారు ఉన్నారు. దీనికి అవ్వ బదులిస్తూ అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి కూడా సిద్ధమేనంటూ చెప్పింది. దానికంటే ముందు మంచి అవకాశాలు నా మనవడికి రావాలని కోరుకుంటున్నా అంటూ బదులిస్తోంది.
మరికొంత మంది ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా, నటిస్తుంటే సిగ్గేయదా అని అనగా సిగ్గు చిన్నప్పుడే వదిలేశానంటూ సరదాగా బదులిస్తూ అప్పలమ్మ తమాషా చేస్తుండేది. అప్పలమ్మ ఇలా నటించడం వల్ల శారీరకంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇష్టంగానే నటించేది. రోజూ ముఖానికి రంగులు వేసుకోవడం, షర్టులు, టీషర్టులు వేసుకోవడం, ఆయుధాలు పట్టుకోవడం.. సుకలో నడవడం వంటి వల్ల కొన్నిసార్లు కాళ్లు, చేతులు నొప్పి పుట్టేవి. అయినా మందులేసుకుంటూ ముందుకు సాగిపోయేది.
డైలాగులు చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఇంగ్లీషు డైలాగులు వచ్చిన గుర్తుపట్టుకుంటూ ముందుకు సాగిపోయేది. వీరి ఛానల్ ఈ మధ్యే లక్ష సబ్స్క్రైబర్లను సైతం దాటేసింది. అప్పలమ్మకు వీడియోస్ గురించి అడిగితే పిల్లలతో వీడియోలు చేస్తుంటే కాలం గడిచిపోతుందని చెప్పేది. మా ఊళ్లో వాళ్లు నీ వల్లే మన ఊరి పేరు అందరికీ తెలిసిందని చెప్పితే నా కష్టమంతా మర్చిపోయేంత హాయిగా ఉంటుంది. తన ఆరోగ్యం సహకరించినన్ని రోజులు నటిస్తూనంటూ చెప్పిన అప్పలమ్మ అవ్వ జీవితం స్ఫూర్తినే కదా!
ఆ ఊర్లో రెండిళ్లకో ఇంజినీర్! - ఎలా సాధ్యమైందో తెలుసా?
41 ఏళ్లకు సినీ ఎంట్రీ, అరుదైన వ్యాధితో పోరాటం- ఇప్పుడీయనే బీటౌన్‌లో సక్సెస్ఫుల్ యాక్టర్!