LATEST THEFTS IN HYDERABAD : అతడి కన్ను పడిందంటే అంతే, ఆ ఇంట్లో చోరీ ఖాయం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 60 కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరక్కుండా దొంగతనాలు చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇలాంటి కరుడు గట్టిన దొంగ వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. ఈ (సెప్టెంబరు) నెల 4న రాజేంద్రనగర్ కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో 60 తులాల బంగారం, అదే ఠాణా పరిధిలో తాళం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది.
దీనిపై దృష్టి సారించిన సీసీఎస్, రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు భోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్ (33) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌లో 1, పేట్ బషీర్‌బాగ్‌లో 2, రాయదుర్గంలో 1 మొత్తం కలిపి 5 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహకరించిన నలుగురు వ్యక్తులు 1.బండారి శాంసన్ 2. షాన్‌దేవ్ సాలౌంకె 3.అమర్‌జీత్‌సింగ్ 4.గుంజపోగు సురేశ్‌లను అరెస్ట్ చేశారు.
వేషాలు మారుస్తూ చోరీలు : గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ సల్మాన్ అలియాస్ కాకా అలియాస్ డేంజర్ అలియాస్ ఆంటోనీ ఒక్కోచోట ఒక్కోపేరుతో చలామణి అవుతాడు. ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు. సీసీ కెమెరాల కంటపడకుండా ఉండే దారిని వెతికి, చోరీ చేసిన బైకులపై రెక్కీ నిర్వహిస్తాడు. కొన్నిసార్లు వాహనం ఓ చోట పెట్టి కాలినడకన ఆయా ప్రాంతాలను మొత్తం గాలించి వస్తాడు. చివరకు దొంగతనం చేసే రోజు ఎక్కడో కొట్టేసిన వాహనంపై వెళ్తాడు. మారు వేషం ధరించి చోరీలకు పాల్పడతాడు.
అరెస్ట్ కాగానే బెయిల్ వచ్చేలా : పలుమార్లు దొంగతనాలు చేసి పట్టుబడిన సుధాకర్‌పై అసిఫ్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్) ప్రయోగించి అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లినప్పుడు ముగ్గురు దొంగలు బండారి శాంసన్, షాన్‌దేవ్ సాలౌంకె, అమర్‌జీత్ సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. వీరితో జట్టు కట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు దొంగతనం చేసిన సొమ్మును సుధాకర్ సోదరుడు సురేశ్‌కు అందజేస్తారు. భోజగుట్టలో సొంత ఇంట్లో ఉంటున్న సురేశ్‌కు స్థానికుడిగా మంచి పేరుంది. ఇతడు ఆ సొత్తును విక్రయించి వీరికి డబ్బులు అందజేస్తుంటాడు. దొంగతనాలకు పాల్పడ్డాక పోలీసులకు చిక్కితే బెయిల్‌పై వెంటనే బయటికి వచ్చేలా డబ్బులను సిద్ధంగా ఉంచుకుంటారు. దీంతో వీరు అరెస్టయిన వెంటనే న్యాయవాది రంగంలోకి దిగి బెయిల్ వచ్చేందుకు ప్రయత్నిస్తాడు.