500 Indians in Cambodia Cyber Trap : మన బలహీనతే ఎదుటివారి బలం అన్నట్లు, భారత్లోని నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాల పేరిట వల విసురుతున్నాయి కొన్ని డ్రాగన్ మూకలు. నకిలీ కాల్ సెంటర్లలో పనిచేయిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారతీయులు ఇప్పటికీ శిబిరాల్లోనే చిక్కుకుపోయారు.
అతడి పేరు దీపు. చైనా సైబర్ ముఠాలకు మెయిన్ ఏజెంట్. విదేశాల్లోని ఫేక్ కాల్‌సెంటర్లలో పనిచేసేందుకు ఇండియా నుంచి ఒక్క ఉద్యోగిని పంపినందుకు అతనికి వచ్చే కమీషన్ అక్షరాలా రూ.2లక్షలు. ఇతడు తొలుత ఫేక్ కన్సల్టెన్సీ ద్వారా మలేసియాలో చేరాడు. అక్కడ కొన్ని నెలలు మగ్గిపోయాడు. సొంతూరు వెళ్తానంటూ ప్రాధేయపడితే, అతడి స్థానంలో మరికొందరిని తీసుకొచ్చి అప్పగించాలని నిబంధన విధించారు.
ఈ మేరకు దిల్లీకి చెందిన ముగ్గురు యువకులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అవకాశమంటూ అక్కడకు రప్పించి తాను బయటపడ్డాడు. ఇప్పుడు అతడే సూత్రధారిగా మారి, దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని దందా చేస్తున్నాడు. సుమారు 200-300 మందిని విదేశాలకు తరలించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఇటీవల ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఖతర్నాక్ కేటుగాళ్లు : మనోళ్లతో మనకే మస్కా కొట్టించి అందినంత సొమ్ము కాజేయడమే చైనా సైబర్ కేటుగాళ్ల ఎత్తుగడ. ఇక్కడి నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని విదేశాల్లో జాబ్స్ పేరిట వల విసురుతున్నారు. టెలీగ్రామ్ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిని ఏజెంట్‌లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా రూరల్ ఏరియాలోని యువతను ఉద్యోగం పేరుతో మలేషియా, దుబాయ్ తీసుకెళ్తున్నామంటూ కంబోడియా చేర్చుతున్నారు.
చెర నుంచి బయటపడాలంటే బాధితులు వచ్చిన ప్రాంతాల నుంచి మరికొందరిని జాబ్స్ పేరిట తీసుకొచ్చి అప్పగించాలని షరతు విధిస్తున్నారు. బాధితులను ఏజెంట్లుగా మార్చుకొని మరికొందరు బాధితులను తయారు చేయిస్తున్నారు. ఇండియా నుంచి 400-500 మంది వరకూ ఆ దేశంలో చైనా మాయగాళ్ల వద్ద పనిచేస్తున్నట్లు బాధితుడు వెల్లడించాడు.