365 Days 450 Festivals In Tirumala : ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామ స్మరణతో మార్మోగుతుంది. తిరుమల వేంకటేశ్వర స్వామికి 365 రోజుల్లో 450 పైనే ఉత్సవాలు జరుగుతుంటాయి.

తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే : "స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్" అని శ్రీవారిని తలంచిన భక్తులకు అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అదే విధంగా కోరికలు ఈరేడుతాయని, ముక్తి సంప్రాప్తిస్తుందని అన్నది స్వామి వారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏడాది పొడవునా శ్రీ వేంకటేశ్వర స్వామికి ఉత్సవాలను జరుపుతోంది. భక్తజన ప్రియుడు, ఆశ్రితకల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే జరుగుతాయి.

తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల - ఏ రోజు ఏం చేస్తారంటే? - Tirumala Brahmotsavam 2024 Schedule
ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్న శ్రీవారు : నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతి రోజూ ఒక పండుగగా, ప్రతి పూటా పరమాన్నభరిత నివేదనలతో, ఏడు కొండల వాడు సంవత్సరం పొడవునా పూజలు అదుకుంటూ ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్నారు.


తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? - డిసెంబర్ కోటా టికెట్లు సిద్ధం చేసిన టీటీడీ - ttd online booking
తిరుమాడ వీధులలో ఊరేగుతూ : ఏడాదికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయునికి ఉత్సవాలు 450కి పైమాటే అంటే అతిశయోక్తి లేదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వేయికన్నులైనా చాలవు. స్వామి వారి ఉత్సవ మూర్తియైన శ్రీ మలయప్ప తన ఉభయదేవేరులైన శ్రీభూదేవీలతో కూడి సర్వాంగసుందరంగా అలంకృతుడై తిరు ఉత్సవాలలో పాల్గొంటూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
