200 Units Free Electricity In Telangana : గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబరు అనుసంధానమై కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో మీటర్ రీడర్‌లు ఇంటింటికీ తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇటీవలె ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వీటిలో చాలా మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేసుకోలేదు. దీనికోసం విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు.
అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ
Gruha Jyothi Free Current : దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడే కనెక్షన్లు 30 లక్షల వరకు ఉన్నాయి. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలు లేవు. సుమారు 10 లక్షల మంది దరఖాస్తు పెట్టుకోలేదు.
వీటి గురించి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తేలతాయి. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే జీవో జారీచేయనుంది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. రాష్ట్రంలోని కరెంటు కనెక్షన్ల తనిఖీపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి రిజ్వీ రెండు డిస్కంల సీఎండీలు, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు.
Electricity Free Under 200 Units : ప్రాథమిక అర్హతలు ఉన్న కుటుంబాల్లో గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నెలవారీ సగటు కరెంటు వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత సంవత్సరం సగటు లెక్కలను డిస్కంలు ఆన్‌లైన్ ద్వారా సేకరిస్తున్నాయి. గత సంవత్సరం 200 యూనిట్ల వరకే విద్యుత్‌ను వాడిన ఇళ్లకు ఇప్పుడు నెలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్లే వాడి ఉంటే దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ యోచన. జీవో విడుదలైతే మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత రానుంది.
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సభ్యుల వివరాలు తీసుకున్న పీఈసీ కమిటీ
అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుంది : ఈటల రాజేందర్