200 students in One Bus in Karimnagar : కరీంనగర్ జిల్లా గంగాధర ఆదర్ష పాఠశాల విద్యార్థులు బస్సు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగాధర మండలానికి 3 కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు నిత్యం వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు ఆర్టీసి బస్సులో వస్తున్నారు. గట్టుబూత్కూర్, కాచిరెడ్డిపల్లి పరిసర గ్రామాల నుంచి 18 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 750 మంది విద్యార్థులు బస్సుల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లిలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు రావడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే విద్యార్థులు రద్దీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పాఠశాలలో 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా, ఆర్టీసీ అధికారులు ట్రిప్పులను తగ్గించారు. దీంతో ఒక్కో బస్సులో 200 మంది వరకూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తమ పుస్తకాల సంచులను బస్సు క్యాబిన్ మీద పెడుతుండడంతో డ్రైవర్‌కూ ఇబ్బందిగా మారుతోంది.
School Bus Overturned : బస్సు నిండా విద్యార్థులు.. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా.. లైవ్ వీడియో
ఈ పాఠశాలకు వెళ్లే గట్టుబూత్కూర్ - గర్శకుర్తి రూట్లో గతంలో విద్యార్థుల కోసం గతంలో రెండు ఆర్టీసీ బస్సులు నడిపేవారు. ప్రస్తుతం ఈ ఒకే బస్సు నడిపిస్తున్నారు. దీంతో దాదాపు 190 మంది విద్యార్థులు ఒకేసారి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గట్టుబూత్కూర్ నుంచి పాఠశాలకు 18 కిలోమీటర్ల దూరం ఉంది. కాచిరెడ్డిపల్లి రూట్లో ఉదయం పూట ఒకే బస్సు రెండు ట్రిప్పుల్లో విద్యార్థులను చేరవేస్తుంది.
అయితే, సాయంత్రం మాత్రం ఒక్క ట్రిప్పుతోనే సరిపెడుతున్నారు. దీంతో ఒకేసారి 200 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కాచిరెడ్డిపల్లి నుంచి న్యాలకొండపల్లికి 16 కి.మీ. దూరం ఉంది. బస్సుల్లో ఖాళీ లేక కొందరు విద్యార్థులు గంగాధర, మధురానగర్ నుంచి సుమారు 7 కి.మీ. కాలినడకన వెళ్తున్నారు. ఈ రూట్లలో అదనంగా రెండు బస్సులు నడిపించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అదనంగా మరో రెండు బస్సులు కేటాయిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
'రోజూ స్కూల్‌కు వెళ్లే సమయంలో బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్‌కు వెళ్లి వచ్చేలోపు చీకటి పడుతుంది. స్కూల్‌కు వచ్చే ఇతర గ్రామాల విద్యార్థులు బస్సులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం వరకు రెండు బస్సులు నడిచేవి. కొంత కాలంగా ఒక్క బస్సు మాత్రమే వస్తోంది. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్‌కు సమయానికి రాలేకపోతున్నాం. ఇద్దరు కూర్చునే సీట్లలో నలుగురు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులను కేటాయించాలి.' స్కూల్ విద్యార్థులు