WPL 2024 UPW VS GG : మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్ ఓటమి పాలైంది. గుజరాత్ జట్టు చేతిలో 8 పరుగుల తేడాతో చిత్తైంది. అయితే గుజరాత్ నెగ్గినా ఫలితం లేకుండా పోయింది. ఈమ్యాచ్‌తో రెండు దాదాపు ఇంటిముఖం పట్టినట్లైంది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ మెరుపులతో ఒంటిచేత్తో యూపీ వారియర్స్‌ను గెలిపించిన దీప్తిశర్మ, ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి ప్రదర్శనే చేసింది. కానీ ఈసారి యూపీ ఓటమి పాలైంది. దానికి కారణం తెలుగమ్మాయి, గుజరాత్ పేసర్ షబ్నమ్(3/11) అద్భుత ప్రదర్శన చేసి యూపీని కట్టడి చేసింది.
షబ్నమ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. మొదట గుజరాత్ 152/8 స్కోరు చేసింది. బెత్ మూనీ(74*) టాప్‌స్కోరర్‌గా నిలిచింది. ఎకిల్‌స్టోన్ (3/38), దీప్తిశర్మ (2/22) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో షబ్నమ్ ధాటికి యూపీ 144/5కే పరిమితమైంది. దీప్తిశర్మ (88*) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఇక 8 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను యూపీ వారియర్స్ కూడా సంక్లిష్టం చేసుకుంది.
షబ్నమ్ చేలరేగి
ఛేదనలో పేసర్ షబ్నమ్ విజృంభణతో యూపీ 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ అలీసా హీలీ (4), చమరి ఆటపట్టు(0), శ్వేత(8) వికెట్లు ఖాతాలో వేసుకున్న షబ్నమ్, ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది. ఒత్తిడిలో పడిన యూపీ ఒక దశలో 7 ఓవర్లకు 35/5తో ఓటమి దిశగా సాగింది. ఈ స్థితిలో దీప్తి శర్మ యూపీని ఆదుకుంది. పూనమ్(36*)తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టింది. కానీ రన్‌రేట్ అదుపులోకి రాలేదు. గుజరాత్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం వల్ల సమీకరణం 12 బంతుల్లో 40గా మారింది. తనూజ వేసిన 19వ ఓవర్లో 3 ఫోర్లతో సహా 14 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి ధాటిగా ఆడినా యూపీ లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. పూనమ్ వేగంగా బ్యాటింగ్ చేయకపోవడం జట్టును దెబ్బకొట్టింది.
బెత్ మూనీ సూపర్ ఇన్నింగ్స్
అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ బెత్ మూనీ నిలబెట్టింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ (43)తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జత చేసి శుభారంభం అందించింది. కానీ లారా ఔట్ అయిన తర్వాత గుజరాత్ తడబడింది. ఎకిల్‌స్టోన్, దీప్తిశర్మ విజృంభణతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడిన మూనీ, స్కోరును 150 దాటించింది. 18 ఓవర్లకు గుజరాత్ స్కోరు 7 వికెట్లకు 120 పరుగులే. అయితే చివరి రెండు ఓవర్లలో బెత్ మూనీ అదరగొట్టింది. 19వ ఓవర్లో రెండు ఫోర్లతో సహా 11 పరుగులు రాబట్టిన ఆమె.. ఎకిల్‌స్టోన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చెలరేగి 5 ఫోర్లు బాదడం వల్ల 21 పరుగులు వచ్చాయి.