Wpl 2024 Delhi Capitals vs Gujarat Giants : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో నేడు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ - దిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. అయితే గుజరాత్ ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ పోరులోనూ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా దిల్లీ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేసింది. అష్లెస్ గార్డ్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 40) హైస్కోర్ నిలిచింది. మిగతా వారు విఫలమయ్యారు. బెత్ మూనీ(14 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12), ఫోబి లిచ్ ఫీల్డ్(10 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 15), వేదా కృష్ణమూర్తి(13 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12), తనుజా కన్వార్(16 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 13), తరున్నామ్ పఠాన్(9) మేఘన సింగ్(10) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జానస్సెన్ తలో 3 వికెట్ తీసి ప్రత్యర్థి గుజరాత్ జట్టు పతనాన్ని శాసించారు. . అరుంధతి రెడ్డి, శిఖా పాండే తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ మెగ్ లానింగ్ అర్ధ శతకం బాదింది. 41 బంతుల్లో 6 సిక్స్‌లు ఒక ఫోర్ సాయంతో 55 రన్స్ చేసింది. అలిస్ క్యాప్సే 27 పరుగులతో పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ మూడో ఓవర్లోనే ఔటైంది. కేవలం 13 పరుగులే చేసింది. లానింగ్ అలిస్ క్యాప్సే(27), రోడ్రిగ్స్‌తో(7) కలిసి బాగానే రాణించింది. గుజరాత్ బౌలర్లలో మేఘనా సింగ్ 4 వికెట్లు పడగొట్టి ఆకట్టుకుంది. గార్డ్‌నర్ 2, తనుజా, కశ్యప్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Wpl 2024 Points Table : ఇక ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ జట్టు ఇంతవరకు ఖాతానే తెరవలేకపోయింది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమిని అందుకుంది. దీంతో దిల్లీ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్? - కెప్టెన్ కూల్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే?
పదో వికెట్‌కు రికార్డ్ పార్ట్నర్షిప్ - టాప్ 10 జోడీలివే!